బాంబు బెదిరింపులతో దేశ రాజధాని మరోసారి అట్టుడికిపోతోంది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. హస్తినలో మొత్తం 80 విద్యాసంస్థల్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ- మెయిల్ చేశారు. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్‌లోని మదర్ మేరీస్, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, సాకేత్‌లోని అమిటీ, వసంతకుంజ్‌ల్లోని దిల్లీ పబ్లిక్ స్కూళ్లకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, అగ్నిమాపక యంత్రాలతో పోలీసులు స్కూళ్ల వద్దకు చేరుకున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు తమకు బాంబు పెట్టినట్లు ఆనవాళ్లు ఏం కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని.. ఏం జరిగినా ఎదుర్కొనే విధంగా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.