జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.
జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు.
ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.