Tuesday, November 12, 2024

ఎల్టీటీ-ఈ రైలులో బాంబు కలకలం.. ఆగంతకుడి ఫోన్‌ కాల్‌తో అప్రమత్తమైన రైల్వే అధికారులు

కాజీపేట, ప్రభన్యూస్‌: విశాఖపట్నం నుంచి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ రైల్వే స్టేషన్‌(ముంబయి)కి వెళ్లుతున్న క్రమంలో ఎల్టీటీ-ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు కలకలం రేకెత్తించిన సంఘటన గురువారం వెలుగుచూసింది. కాజీపేట రైల్వే జంక్షన్‌లో రైలును గంట ఇరవై ఐదు నిముషాల పాటు- ఆపి రైల్వే ఆర్పీఎఫ్‌, జీఆర్పీ, లా అండ్‌ ఆర్డర్‌, బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైలులో బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాజీపేట రైల్వే ఆర్పీఎఫ్‌ సీఐ సంజీవరావు తెలిపిన వివరాలు ప్రకారం సికింద్రాబాద్‌లోని డీజీ కంట్రోల్‌ రూంకు ఉదయం 10.25 నిముషాలకు గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్‌ చేసి రైలు నంబర్‌ 18519 ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు ఉన్నట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు.

సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ సెక్యూరిటీ కంట్రోల్‌ రూం నుంచి కాజీపేట ఆర్పీఎఫ్‌ స్టేషన్‌కు సమాచారం రావడంతో కాజీపేట రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ సంబంధిత స్థానిక ముఖ్య రైల్వే అధికారులకు, బీడీడీఎస్‌ వరంగల్‌ బాంబ్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందం, ఆర్పీఎఫ్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందానికి సమాచారం అందించామన్నారు. రైలు కాజీపేట రైల్వే జంక్షన్‌ మూడో నంబర్‌ ప్లాట్‌ ఫారంలో ఆగగానే సంబంధిత బాంబ్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందం, ఆర్పీఎఫ్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందం, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ, లా అండ్‌ ఆర్డర్‌ సిబ్బందితో రైలు మొత్తం బోగీలలోని ప్రయాణికులు, బ్యాగులను క్షుణంగా తనిఖీలు చేశామని తెలిపారు. దాదాపు గంటన్నర పాటు- రైలులో పోలీసులు బాంబు డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టడంతో జరగరానిది ఏదో జరిగిందని ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, రైల్వే స్టేషన్‌ మీదుగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బాంబ్‌ డాగ్‌ స్క్వాడ్‌ బృందం అధికారులు రైలులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తులు, బాంబులేదని తేల్చి చెప్పడంతో రైల్వే అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. బాంబు స్క్వాడ్‌ సిబ్బంది ఆగంతకుడు ఇచ్చిన ఫోల్‌ కాల్‌ ఫ్రాంక్‌ కాల్‌ అని రైలులో బాంబులేదని నిర్ధారణకు వచ్చి క్లియరెన్స్‌ ఇవ్వడంతో రైల్వే అధికారులు కాజీపేట రైల్వే జంక్షన్‌లో నిలిపిన ఎల్టీటీ-ఈ రైలును తిరిగి సికింద్రాబాద్‌ వైపునకు పంపించారు. ఎల్టీటీ-ఈ రైలులో బాంబు ఉందని ఫ్రాంక్‌ కాల్‌ చేసిన వ్యక్తిపై రైల్వే యాక్టు ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో సీనియర్‌ డీఎంఈ సందీప్‌ కుమార్‌, రైల్వే సీసీఐ రాజగోపాల్‌, ఏడీఈఎస్కాజీపేట, స్టేషన్‌ మాస్టర్‌ బాలరాజు, కాజీపేట సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి, ఆర్పీఎఫ్‌ జీఆర్పీ సీఐలు నరేష్‌, రాంమూర్తి, బాంబు, డాగ్‌ స్కాడ్‌ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement