పాట్నా: గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం 17 మందితో కూడిన పడవ అమ్దాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్ సమీపంలో గంగా నదిలో బోల్తా పడి మునిగింది. అప్రమత్తమైన కొందరు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు.
పడవ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిన పది మందిని రక్షించారు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మృతులను 60 ఏళ్ల పవన్ కుమార్, 70 ఏళ్ల సుధీర్ మండల్‌గా గుర్తించినట్లు చెప్పారు. మరణించిన మరో వ్యక్తిని ఇంకా గుర్తించలేదన్నారు.
మరోవైపు పడవ బోల్తాపడిన ఘటనలో నలుగురు వ్యక్తులు గంగా నదిలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం సహాయక, గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.