న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు పద్మాలు వికసించాయి. 2022వ సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం 128 పద్మ అవార్డులిస్తోంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తొలి విడతగా 64 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఇద్దరికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు, డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్(మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరపున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతా ప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను తీసుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, సీరం ఇనిస్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, గుర్మీత్ బావా (మరణానంతరం), ఎన్.చంద్రశేఖరన్, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, రాజీవ్ మెహర్షి,సచ్చిదానంద స్వామిలు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 28న జరగనుంది. అవార్డు గ్రహీతల జాబితాలో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఈ రెండు విడతల్లో కలిపి అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులుయ/ఎన్నారైలు ఉన్నారు. 13 మందికి మరణానంతరం అవార్డులు అందిస్తున్నారు. అవార్డుల కార్యక్రమానికి ముందు మహా సహస్రావధాని గరికపాటి నరహింహారావు కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని ఆయన నివాసంలో కలిశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..