తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా ధాటికి ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ప్రత్యేకించి డాన్బోస్ రీజియన్‌లోని లుషాంక్ ప్రాంతంలో రష్యా పై చేయి సాధించింది. ఆ ప్రాంతంలో ప్రధాన నగరం సీవీరోడోనెట్స్కీలోని మూడోవంతు ప్రాంతాన్ని రష్యా చేజిక్కించుకుంది. అక్కడ దాదాపు వీధిపోరాటం సాగుతోంది. ఉక్రెయిన్ సేనలు భారీగా దెబ్బతింటున్నాయి. ఆ నగరంలోని భవనాలు 90 రష్యా దాడుల్లో శాతం మేర ధ్వంసమైనాయి. నీటి సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాతో తూర్పు ఉక్రెయిన్ను అనుసంధానం చేసుకోవాలంటే డాన్బోస్ రీజియన్‌ను స్వాధీనం చేసుకోవాలన్నది రష్యా వ్యూహం. ఉక్రెయిన్‌పై దండయాత్ర లక్ష్యాల్లో ఇదీ ఒకటి. దాదాపు ఆ లక్ష్యాన్ని రష్యా సాధించినట్టే పరిస్థితులున్నాయి.
భీకర దాడులు: బుధవారంనాడు లుషాంక్ ప్రాంతంలో రష్యా ముమ్మర దాడులు చేసింది. మూడువైపులనుంచి విరుచుకుపడింది. రష్యాతో పోరాటం చాలా కష్టంగా ఉందని, అయినా ఉక్రెయిన్ సేనలు వెనక్కు తగ్గడం లేదని, రష్యా బలగాలను వెనక్కు నెట్టేలా వ్యూహాత్మకంగా ప్రతిఘటిస్తున్నాయని లుషాంక్ మిలటరీ అధికారి సెర్హియ్ హెడే ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కీలక దశకు చేరుకుందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. సోవియట్ కాలంనాటి భీకర ఆయుధాల ధాటికి ఉక్రెయిన్ సేనలు నష్టపోతున్నాయి. ప్రత్యేకించి ఫిరంగుల దాడితో భారీగా దెబ్బతింటున్నాయి. రష్యాను ఎదుర్కోవాలంటే అత్యాధునిక, భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ కోరుతోంది. కాగా ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన నాటో ఆయుధాలను బుధవారంనాడు ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. లెవివ్ రీజియన్‌లోని జోలోచెవ్ ఆయుధాలను దాచిన భవనాన్ని పేల్చేశామని వెల్లడించింది. ధ్వంసమైన ఆయుధాలలో 155 ఎంఎం ఎం 777, దీర్ఘశ్రేణి కాలిబర్ క్షిపణులున్నాయని పేర్కొంది. కాగా ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా సహా 50 దేశాలు ప్రకటించాయి. అమెరికాలో ఆయా దేశాలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బెర్గ్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.