ఖర్కీవ్ అనగానే.. గుర్తుకొచ్చేది చారిత్రక కట్టడాల నిలయం. ఎంతో అందంగా కనిపించే ఈ నగరం.. ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరంగా ఖర్కీవ్ నిలుస్తుంది. రష్యా క్షిపణి దాడులకు ఈ నగరం వణికిపోతున్నది. రష్యా నుంచి నిరంతరం షెల్స్ వచ్చి పడుతున్నాయి. నివాస సముదాయాలు, చారిత్రాత్మక కట్టడాలు, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. సెంట్రల్ ఖర్కీవ్లోని ఫ్రీడమ్ స్క్వేర్ను రష్యా ప్రయోగించిన ఓ శక్తివంతమైన మిసైల్ తాకింది. అంతే.. క్షణాల్లో అక్కడి ప్రాంతమంతా.. ధ్వంసమైంది. ఈ దాడి జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో జన సంచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నడుస్తున్న కార్లపౖౖెనే ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం పదుల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్టు నగర మేయర్ ఇహోర్ తెరెఖోవ్ తెలిపారు. 40 మందికి పైగా గాయాలపాలైనట్టు వివరించారు.
అనాగరిక రష్యన్ దాడి..
ఖర్కీవ్లోని సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ ్టలపై అనాగరిక రష్యన్ క్షిపణి దాడులు చేసిందని ఇహోర్ వెల్లడించారు. ఉక్రెయిన్ను విచ్ఛిన్నం చేయలేకే.. ఇలా అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నట్టు విమర్శించారు. రష్యాను ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దాడిలో సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్లోని ఓ చారిత్రాత్మక భవనం కూడా ధ్వంసమైనట్టు ఇహోర్ తెలిపారు. ఈ దాడితో.. డజన్ల కొద్ది మృతదేహాలు సెంట్రల్ ఫ్రీడమ్ స్క్వేర్లో చెల్లాచెదురుగా పడి కనిపించాయి. క్షణాల్లో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. కొన్ని కార్లు 50 అడుగుల ఎత్తు వరకు లేచి కింద పడ్డాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..