Tuesday, November 26, 2024

ప్రధాని మోదీని ఆశీర్వదించండి.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సరికొత్త సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలోని తన నివాసం 6, అశోక్ రోడ్‌లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి, అనంతరం మాట్లాడుతూ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది నుంచి జరుపుకుంటున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా గుర్తింపునకు నోచుకోని స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం పాటుపడిన మహనీయులను స్మరించుకుంటూ ముందుకెళ్తున్నామని గుర్తుచేశారు. ఇది వచ్చే ఆగస్టు వరకు కొనసాగుతుందని తెలిపారు. అలాగే ఈ ఏడాది జీ-20 సదస్సుకు సారథ్యం వహించే అవకాశం భారతదేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చిందని, ఈ సందర్భంగా దేశంలోని 56 నగరాల్లో 250కి పైగా సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

ఇందులో 20 దేశాలకు చెందిన దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల నిపుణులు.. ఇలా లక్ష మంది వరకు పాల్గొంటారని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను భారతదేశం అధిగమిస్తూ ముందుకు సాగుతోందని, కోవిడ్-19ను జయించి ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని, ఈ క్రమంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు అన్న ఉద్దేశంతో ప్రధాన మంత్రి పేదలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తున్నారని గుర్తుచేశారు. మరోవైపు నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు స్టార్టప్ ఇండియా, ముద్ర యోజన, సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేస్తున్నామని తెలిపారు.

దేశంలో అత్యధిక మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో రైతులకు రూ. 6 వేలు అందజేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సంఖ్యను పెంచుకుంటూ శరవేగంగా రవాణా జరిగేలా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మరింత గౌరవాన్ని తీసుకొస్తూ ముందుకెళ్దామని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి దేశ ప్రజలను కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement