ఇరాన్‌లో జంట పేలుళ్లు జరిపింది తామేనంటూ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. టెలిగ్రాం ఛానెళ్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.పేలుళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల పేర్లు , ఫొటోలనూ తమ వార్తాపత్రిక అమఖ్ ద్వారా బహిర్గతం చేసింది.
వారు ఇరాన్ కు చెందినవారా? లేక విదేశీయులా? అనేది తెలియరాలేదు. పేలుళ్లను ఆత్మాహుతి దాడులుగా ఐఎస్ తెలిపింది. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు బుధవారం భారీగా తరలివచ్చిన జన సమూహంలోకి చొచ్చుకెళ్లి.. శరీరానికి చుట్టుకున్న బాంబులను వారు ఎలా పేల్చుకున్నారో వివరించింది. గతంలోనూ సామాన్య పౌరులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌లో ఐఎస్ దాడులకు తెగబడింది. జనరల్ ఖాసిం సులేమానీ ఈ ఉగ్ర సంస్థపై పోరాడుతూ వచ్చారు. 2020లో అమెరికా దాడిలో ఆయన మృతి చెందడాన్ని స్వాగతిస్తూ ఈ ముష్కర మూక అప్పట్లో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
కెర్మన్‌లో సులేమానీ సమాధివద్ద నివాళులర్పించేందుకు తరలివచ్చిన జన సమూహాన్నే లక్ష్యంగా చేసుకొని పాల్పడ్డ ఈ పేలుళ్లలో 84 మంది మృతిచెందారు. తొలుత 103 మరణించినట్లు వెల్లడించినప్పటికీ.. తర్వాత ప్రభుత్వ వర్గాలు రెండు దఫాల్లో ఆ సంఖ్యను కుదించాయి. ఘటనా స్థలం కెర్మన్.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 820 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ పేలుళ్లు జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌ను నిందిస్తూ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పొలిటికల్ డిప్యూటీగా ఉన్న మొహమ్మద్ జంషీదీ ఓ ప్రకటన చేశారు. దీన్ని అమెరికా ఖండించింది. ఈ పేలుళ్లలో ఇజ్రాయెల్ హస్తం ఉన్న సూచనలూ కనపడటం లేదని తెలిపింది.