Friday, November 22, 2024

హిండెన్‌బర్గ్‌ దెబ్బకు బ్లాక్‌ విలవిల.. జాన్‌డోర్సే సంపద 4,327 కోట్లు ఆవిరి

షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఈ సారి అమెరికాకు చెందిన ఆర్ధిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ బ్లాక్‌పై బాంబు పేల్చింది. ట్విటర్‌ స హ వ్యవస్థాపకుడు జాన్‌ డోర్సేకు చెందిన బ్లాక్‌ అనేక అక్రమాలకు పాల్పడిందిని హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో తెలిపింది. రెండు సంవత్సరాల పరిశోధన తరువాతే తాము ఈ నివేదికను రూపొందించామని తెలిపింది. ఖాతాదారుల సంఖ్య ఎక్కువ చూపిస్తూ, షేర్‌ విలువను కృత్రిమంగా పెంచారని, ఈ చర్య వల్ల ప్రభుత్వాన్ని, పెట్టుబడిదారులను ఈ సంస్థ మోసం చేసిందని పేర్కొంది. కరోనా సమయంలో వ్యవస్థాపకులు 100 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని ఆరోపి ంచింది. బ్లాక్‌ ఖాతాదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని, సంస్థ ఖాతాల్లో 75 శాతం వరకు నికిలీవే ఉన్నాయని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు వెల్లడించారని తెలిపింది.

బ్లాక్‌కు భారీ నష్టం..

హిండెన్‌బర్గ్‌ నివేదికతో మార్కెట్‌లో బ్లాక్‌ షేరు ధర భారీగా పతనమైంది. బ్లాక్‌ వ్యవస్థాపకుడు జాన్‌ డోర్సే సంపదలో 526 మిలియన్‌ డాలర్లు (దాదాపు 4,327 కోట్లు) అవిరయ్యాయి. బ్లూమ్‌బర్గ్‌ నివేదకి ప్రకారం ఆయన సంపద 11 శాతం తగ్గి 4.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడైన డోర్సే సంపదలో ఎక్కువ భాగం బ్లాక్‌ షేర్ల రూపంలోనే ఉంది. ఆయన సంపద 4.4 బిలియన్‌ డాలర్లలో బ్లాక్‌ షేర్ల వాటా 3 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. ట్విటర్‌లో ఆయనకు 388 మిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి.

అదానీ గ్రూప్‌పై జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్‌ షేల్‌ కంపెనీలు పెట్టి పన్ను ఎగవేతకు, మనీలాండరింగ్‌కు పాల్పడిందని, షేర్ల విలువను కృత్రిమంగా పెంచిందని, అకౌంటింగ్‌లో మోసాలకుపాల్పడిందని హిండెన్‌ బర్గ్‌ నివేదికలో ఆరోపించింది. ఈ నివేదికలో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 140 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయింది. తాజాగా బ్లాక్‌పై కూడా హిండెన్‌బర్గ్‌ ఇలాంటి ఆరోపణలనే చేసింది. 2020లో విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ నిలోలాపైనా కూడా హిండెన్‌బర్గ్‌ పలు ఆరోపణలతో నివేదిక వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ షేరు విలువ భారీగా పడిపోయింది. ఈ ఆరోపణలపై విచారించిన ప్రభుత్వం నికోలా సంస్థ వ్యవస్థాపకుడు ట్రెవర్‌ మిల్టన్‌ అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement