కరోనా నుంచి కోలుకున్న కొందరిని బ్లాక్ ఫంగస్ వ్యాధి కబళిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందనే వార్తలు రాగా.. ఇప్పుడు పెదపాడు మండలం కలపర్రుకు చెందిన వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ నెల 10న ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కంటి నుంచి నీరు కారుతుండగా తర్వాత కంటివాపు ఎక్కువైంది. దీంతో ఏలూరులోని ఓ కంటి ఆసుపత్రిలో పరీక్ష చేయించగా అది బ్లాక్ ఫంగస్‌గా అనుమానిస్తూ వైద్యులు విజయవాడకు రిఫర్ చేశారు.
విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అయితే అది బ్లాక్ ఫంగస్ అవునో, కాదో వైద్య పరీక్షలు తర్వాత నిర్ధారిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. కాగా నిడదవోలులో బ్లాక్ ఫంగస్ లక్షణాల బాధితుడికి ఎమ్మెల్యే జీఎస్ నాయుడు భరోసా ఇచ్చారు. బాధితుడు అంజిబాబు కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. బాధితుడిని ప్రత్యేక వాహనంలో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలిస్తానన్నారు.