ఆంధప్రభ స్మార్ట్ – ముంబయి – ఇండియన్ స్టాక్ మార్కెట్ నేడు భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 81,158.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,867.55) నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టంతో 80,868.91 వద్ద కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 885.60 పాయింట్ల నష్టంతో 80,981.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 293 పాయింట్ల మేర నష్టపోయి 24,717 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. నిఫ్టీలో మెటల్ , పీఎస్ యూ బ్యాంక్ అత్యధికంగా 2శాతం పైగా పతనమయ్యాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 , నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఒక్కొక్కటి 1శాతం కంటే ఎక్కువ పడిపోవడంతో అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.