Sunday, November 24, 2024

బీజేపీ నయా వ్యూహం.. జాతీయవాద అంశాలతో ప్రజల్లోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నాలుగు నెలల్లో అసెంబ్లి ఎన్నికలు, ఆ తర్వాత ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ నయా వ్యూహాన్ని సిద్ధం చేసింది. జాతీయవాద అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. జాతీయవాద అంశాలను ప్రజల్లో మరీముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకునేవిధంగా ప్రస్తావిస్తూనే స్థానిక సమస్యలను కూడా లేవనెత్తాలని భావిస్తోంది. జాతీయవాద అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం వెనక యువత ఓట్లను కొల్లగొట్టడమే కాషాయ పార్టీ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఓటర్లలో యువ ఓటర్ల సంఖ్యనే ఎక్కువ. తెలంగాణలో మొత్తం 3కోట్ల 03లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటరు ఎన్‌రోలింగ్‌ జాబితాలో దాదాపు 4లక్షల మంది 18-19 సంవత్సరాల వయసు ఉన్న కొత్త ఓటర్లు చేరుతున్నారు. మొత్తం ఓటర్ల లో యువ ఓటర్ల సంఖ్య కోటికిపైనే ఉంటుందని , ప్రతీ ఎంపీ , అసెంబ్లి సెగ్మెంట్‌లో వీరి ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో యువత ఓట్లను పొందాలంటే జాతీయవాద అంశాలపై వరుస కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. అందులో భాగంగా ఈ సారి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని వరుసగా జాతీయవాదాన్ని తట్టిలేపే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అమరవీరుల స్మరణార్థం దేశ వ్యాప్తంగా మేరా మిట్టి – మేరా దేశ్‌ (నేను పుట్టిన నేల – నను కన్న దేశం) కార్యక్రమంతోపాటు ఆగస్టు 14న భారతదేశ విభజనను నిరసిస్తూ దేశ విభజన గాయాల సంస్మరణ ది నర్‌ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది.

- Advertisement -

మేరామిట్టి- మేరా దేశ్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఆగస్టు 15 వరకు వరుస కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించనుంది. అధిష్టానం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి జిల్లాకు , ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇద్దరేసి కో.ఆర్డినేటర్లను నియమించింది. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర స్థాయిలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన వర్క్‌షాప్‌ కూడా జరిగింది.

ఈ కార్యక్రమానికి తరుణ్‌చుగ్‌, పార్టీ రాష్ట్ర ఎన్నికల్‌ ఇన్‌చార్జి ప్రకాష్‌ జవదేకర్‌ తదితర ముఖ్యనేతుల హాజరయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణం వరకు అన్ని వర్గా లప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి వెళ్లి దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, వీర సైనికులకు నివాళులు అర్పించనున్నారు.

మొత్తం అయిదు దశల్లో… పోలింగ్‌ బూత్‌స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో , రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహించనుంది. ప్రతీ గ్రామం, పట్టణం నుంచి మట్టిని సేకరించి ఆగస్టు 15నాటికి ఢిల్లికి పంపించనున్నారు. అక్కడ దేశ వ్యాప్తంగా సేకరించిన మట్టితో అమరవీరుల స్మృతి వనాన్ని నిర్మించనున్నట్లు బీజేపీ ప్రకటించింది.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరంగా యాత్రను రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో నిర్వహించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవాలని బీజేపీ నిర్ణయించింది.

ఆగస్టు 14న దేశ విభజన గాయాల సంస్మరణ దినం…

ఇక దేశం ఇండియా-పాకిస్థాన్‌ గా విడిపోయిన సమయంలో చోటు చేసుకున్న మారణకాండను నిరసిస్తూ పలు కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా, తెలంగాణలోని ప్రతీ మారుమూల పల్లెలోనూ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 14న ్‌ విభజన గాయాల సంస్మరణ దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామానికి వెళ్లి జాతీయ జెండాలను ఎగురవేయడం, దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న మారణకాండపై వక్తల ద్వారా ప్రసంగాలు ఇవ్వడం, దేశ విభజన గాయాలకు చెందిన ఫోటోలు, ఫీల్మ్‌లను, నాటి వార్తా పత్రికల ప్రతులను ప్రదర్శనకు ఉంచనున్నారు. ప్రతీ మండల కేంద్రంలో మేథావులతో సదస్సులు నిర్వహించి దేశ విభజన నాటి మారణకాండను ప్రజలకు వివరించబోతున్నారు.

జిల్లా కేంద్రంలో దేశ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆనాడు చెలరేగిన హింసపై వీడియోలు, డాక్యుమెంటరీలు కూడా ప్రదర్శించనున్నారు. సార్వత్రిక ఎన్నికలనాటికి ప్రతి పల్లెలో జాతీయవాదాన్ని తట్టిలేపుతూ యువతను సంఘటితం చేసేలా బీజేపీ కొత్త వ్యూహాన్ని రూపొందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement