Friday, November 22, 2024

TG | బీజేపీ నూతన యాక్షన్ ప్లాన్.. రేపట్నుంచే రంగంలోకి !

హైదరాబాద్: హైడ్రా, మూసీ కూల్చివేతల విషయంలో బీజేపీ కార్యచరణ రేపు(గురువారం) ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులయ్యే బాధితులను ఆదుకునేందుకు రేపట్నుంచే తమ పోరాటం ఉంటుందని ఆయన తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇవాళ(బుధవారం) కిషన్ రెడ్డి పర్యటించారు.

అంబర్‌పేట్, అసెంబ్లీ, ముసారాంబాగ్, అంబేడ్కర్ నగర్, తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకూ బస్తీలను సందర్శించారు. కేంద్రమంత్రి స్వయంగా వెళ్లి నిర్వాసిత కుటుంబాల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడే పరిస్థితి వస్తుందంటూ కిషన్ రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు.

సారూ.. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు.

తమను ఆదుకునేందుకు ముందుకు రావాలిని కోరారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను ఓదార్చారు. ఇళ్లు కూల్చే పరిస్థితి వస్తే తానే అడ్డుగా నిలబడి కాపాడతానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని, మీ అందరికీ బీజేపీ తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..” పేదలకు అండగా ఉండటం కోసమే మేము చేపట్టేబోయే భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. ఈసారి మేము ఏదీ చెప్పి చేయం. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇళ్ల కూల్చడంతో కేంద్రానికి ఏం సంబంధమో ఆయనే చెప్పాలి. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. పరస్పర రాజకీయ విమర్శలు తర్వాత చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాది మంది పేదలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. పేదలకు అండగా ఉండటం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మీ కోసం మేము నిలబడతాం. రేపట్నుంచే కొత్త కార్యచరణ అమలు చేయబోతున్నాం. కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం. మీ ఆస్తులకు నష్టం జరగనివ్వం” అని హామీ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement