Tuesday, November 26, 2024

Delhi | వరుస సమావేశాలతో కమలనాథుల కసరత్తు.. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు వరుస భేటీలు, సమావేశాలతో గత కొన్నాళ్లుగా విశ్రాంతి లేకుండా బిజీగా ఉన్నారు. శుక్రవారం ఉత్తరాది రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో రోజంతా సమావేశం నిర్వహించిన బీజేపీ జాతీయ నాయకత్వం, శనివారం సాయంత్రం త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దింపాల్సిన అభ్యర్థుల గురించి అగ్రనేతలు సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ కార్యాలయానికి ఎదురుగా కొత్తగా నిర్మించిన అనెక్స్ భవనంలో ఈ సమావేశం జరిగింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు సంఘ్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది. గుజరాత్ (3), పశ్చిమ బెంగాల్ (6), గోవా (1) రాష్ట్రాల్లో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

జూన్ 27న ఈ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేయగా, నామినేషన్లు దాఖలు చేయడానికి జులై 13ను చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత డెరెక్ ఓబ్రెయిన్ సహా మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆగస్టు 18తో ముగుస్తుండగా, గోవాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండూల్కర్ పదవీకాలం జులై 28తో ముగుస్తోంది.

- Advertisement -

తెలుగువారికి చోటు?

గుజరాత్‌, గోవా రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఈ 10 స్థానాల్లో 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వీటిలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను మంత్రివర్గంలో కొనసాగించాలని భావిస్తే ఆయనకు గుజరాత్ నుంచే మరోసారి రాజ్యసభకు కొనసాగించే అవకాశం ఉంది. మరో 4 స్థానాల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యమే లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చోటు కల్పించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌తో పాటు ఆ రాష్ట్రానికే చెందినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావులలో ఒకరికి అవకాశం ఉంటుందని విశ్లేషణలున్నాయి. ఒకవేళ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ‘కాపు’లకు చోటు కల్పించాలని భావిస్తే సోము వీర్రాజు లేదా పార్టీలో మరో కాపు నేతకు అవకాశం ఇస్తారని ఊగాహానాలు ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ నుంచి ‘రెడ్డి’ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే వెదిరె శ్రీరామ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది.

ఆయన ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖలో సలహాదారుడిగా పనిచేస్తున్నారు. గత విస్తరణ సమయంలోనే ఆయన పేరు వినిపించినప్పటికీ అవకాశం దక్కలేదు. లేదంటే ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా ఎవరైనా బ్యూరోక్రాట్‌ను తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగానే శనివారం సాయంత్రం అగ్రనేతలు సమావేశమైనప్పటికీ, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు త్వరలో సమావేశమవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

టార్గెట్ సౌత్

హైదరాబాద్ నగరంలో శనివారమే జరగాల్సిన దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతల సమావేశం ప్రధాన మంత్రి వరంగల్ పర్యటన కారణంగా ఆదివారానికి వాయిదా పడింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి, అండమాన్-నికోబార్, లక్షద్వీప్ విభాగాల పార్టీ అధ్యక్షులు, ఎన్నికైన చట్ట సభల ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు. బీజేపీకి కొరుకుడు పడని దక్షిణ భారతదేశంలో పార్టీని విస్తరించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది.

వరుసగా ఉత్తర, దక్షిణ, తూర్పు జోన్ల రాష్ట్రాలతో సమావేశాలను నిర్వహించేందుకు కమలనాథులు నిర్ణయించుకున్నారు. ఇందులో ఉత్తర భారతదేశం మినహా దక్షిణ, తూర్పు భారతదేశంలో బీజేపీ బలహీనంగా ఉంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ, తూర్పు జోన్ల నుంచి బీజేపీ ఎంపీ సీట్లను పెంచుకోవాలని, తద్వారా నార్త్ జోన్‌లో తగ్గే స్థానాలను భర్తీ చేసుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఆయా జోన్లకు తగిన ప్రణాళికలతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement