Monday, November 25, 2024

Delhi | బీజేపీది దృతరాష్ట్ర కౌగిలి.. అందుకే కేసీఆర్ ఓడిపోయారు : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో ఎవరు అంటకాగినా ఓటమి, పతనం ఖాయమని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. బీజేపీది దృతరాష్ట్ర కౌగిలి అని విమర్శించారు. ఆ కౌగిలిలో కేసీఆర్ బందీ అయ్యారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లోనూ అధికార విపక్షాలు రెండూ బీజేపీకి వంత పాడుతున్నాయని, రేపు వారి పరిస్థితి కూడా అంతేనని సూత్రీకరించారు.

బీజేపీ తెలుగు రాష్ట్రాలకు బద్ద వ్యతిరేకి అని, నయా పైసా విడుదల చేయకపోయినా సరే పాలకులు, ప్రతిపక్షం పోరాడడం లేదని విమర్శించారు. మరోవైపు విపక్ష కూటమిలో భాగంగా పొత్తులతో వెళ్తేనే గెలుపు సాధ్యమని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులతో కలుపుకుని వెళ్లినందుకే కాంగ్రెస్ గెలుపొందగలిగిందని, ఒంటరిగా పోటీ చేసిన మూడు రాష్ట్రాల్లో ఘోరంగా పరాజయం పాలైందని గుర్తుచేశారు. ఏపీలో జగన్ పాలన చివరి దశకు చేరుకుందని, ఆయనకు ఇంటా బయటా అందరూ శత్రువులే ఉన్నారని నారాయణ అన్నారు.

చివరకు కన్నతల్లి, తోడబుట్టిన చెల్లిని కూడా దూరం చేసుకుని శత్రువులుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. విపక్ష కూటమి (ఇండియా) బలోపేతం కోసం కాంగ్రెస్ విశాల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ బెదిరింపులకు భయపడి కొందరు కూటమికి దూరమవుతున్నారని అన్నారు. బెంగాల్‌లో కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ఉండొద్దని మమత బెనర్జీ షరతులు పెడుతున్నారని, దాని వల్లనే లుకలుకలు మొదలయ్యాయని నారాయణ అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపులపై ఇండియా కూటమి పార్టీలు సంకుచితంగా వ్యవహరించవద్దని హితవు పలికారు.

- Advertisement -

ఒకట్రెండు పార్టీలు దూరమైనా సరే కూటమి నిలిచే ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. అలాగే అయోధ్య రామమందిర నిర్మాణం అనంతరం ఏర్పడ్డ ప్రభావాన్ని ఎదుర్కొనే సత్తా కూటమికి ఉందని అన్నారు. ప్రజలు తమతో ఉన్నారని, అందుకే బీజేపీ దేవుణ్ణి నెత్తికి ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నేరుగా మత, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణం గురించి ప్రస్తావించడం ప్రైవేటు వ్యవహారమని, కానీ ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ఇద్దరూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లౌకిక విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

వ్యక్తులుగా ఆలయాలకు వెళ్లాడాన్ని తప్పు పట్టడం లేదని, కానీ రాజకీయాన్ని మతాన్ని కలపకూడదన్న లౌకిక సూత్రాన్ని ఉల్లంఘించడం మాత్రం తగదని అన్నారు. కమ్యూనిస్టులు కూడా ఆలయాలు సందర్శిస్తారని, కాకపోతే కానీ దేవుడిపై నమ్మకంతో కాదని అన్నారు. ఆలయాల నిర్మాణశైలి చూడడం కోసమే కమ్యూనిస్టుల్లో కొందరు ఆలయాలకు వెళ్తారని ఆయన సూత్రీకరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement