Saturday, November 2, 2024

సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ కుట్ర.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

చెన్నూరు, మార్చి 15 (ప్రభన్యూస్‌): సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 210 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తుందన్నారు. రెండు బొగ్గు బావులను అమ్మకానికి పెట్టిన కేంద్రం సింగరేణిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతోందన్నారు. దేశ ప్రజల సొమ్మును ఆదానీకి కట్టబెట్టేందుకు కృషి చేస్తుందన్నారు. మత తత్వ రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటైందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున రూ. 400 ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ. 1200లకు చేరిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని మరిచిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టడమే తమ పనితీరుకు నిదర్శనమన్నారు.

రైతుబం ధు, రైతుబీమా, దళిత బంధు, కళ్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, గృహ లక్ష్మిలాంటి పథకాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న పథకాలు దేశమంతా అమలు చేసేందుకు కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల ఎకరాలలో వరిసాగు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 16లక్షల ఎకరాలలో మాత్రమే వరి సాగైందన్నారు. భూమికి బరువయ్యే పంట తెలంగాణలో పండుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కొరత, కరెంటు కొరతతోపాటు మద్దతు ధర లేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పంట పెట్టుబడుల కోసం రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది రైతుబంధు కోసం 14,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఉచిత కరెంటు కోసం 12వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు.

- Advertisement -

ప్రజలకు 16వేల మెగా వాట్ల కరెంటు ఇస్తున్నామన్నారు. సమాధులు తవ్వెటోళ్లు, ప్రగతి భవన్‌, సచివాలయం కూల్చెటోళ్లు కావాలా.. పునాదులు నిర్మించే కేసీఆర్‌ కావాలో.. ప్రజలు తేల్చుకోవాలన్నారు. మిషన్‌ భగీరథతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరందిస్తున్నామన్నారు. ప్రపంచం అబ్బురపడేలా అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. 1600 కోట్ల రూపాయలతో చెన్నూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు రెండు పంటలకు సాగు నీరందుతుందన్నారు. శ్రీరామనవమి తర్వాత న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభిస్తామని, గర్భిణీ స్త్రీలకు మూడవ నెలలో ఒకసారి, ఏడవ నెలలో ఒకసారి కిట్‌ అందిస్తామన్నారు.

త్వరలోనే గృహ లక్ష్మి పథకం ప్రారంభమవుతుందని, స్థలం ఉన్న వారికి 3లక్షల రూపాయలను ఇంటి నిర్మాణం కోసం అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చత్తీస్‌ఘడ్‌ పాలనను తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, అక్కడ 500 పింఛన్‌ ఇస్తున్నారని, తెలంగాణలో 2016 రూపాయలను తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం చత్తీస్‌ఘడ్‌లో లేక పోవడం రేవంత్‌రెడ్డికి తెలియక పోవడం ప్రజలకు గమనించాలన్నారు. బహిరంగ సభలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్యతోపాటు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement