Sunday, November 24, 2024

Big Story : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌.. కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా స్కెచ్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న అసెంబ్లి ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. అందుకు రాష్ట్ర క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. సాధారణ ఎన్నిలకు మరో ఏడాది మాత్రమే ఉండడంతో అసెంబ్లి నియోజకవర్గాల వారీగా బలం పెంచుకుంటోంది. అందుకు అనుగుణంగా బూత్‌ కమిటీలు, స్థానిక నాయకత్వ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బూత్‌ కమిటీల నియామకంపై ఆ పార్టీ అగ్రనేతల ఆదేశాలతో రాష్ట్ర బీజేపీ కసరత్తు ప్రారంభించనుంది. చేరికలపైన కూడా ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. ఈనెల 20, 21, 22 తేదీల్లో రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ తరగతుల్లో రాష్ట్ర నేతలకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నేతలు హాజరు కాబోతున్నారు.

ఒక్కో జాతీయ నేత సుమారు 40 నుండి 50 నిమిషాల పాటు పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల లక్ష్యాలు, సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, రాజకీయ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా తరగతులకు బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌, సహా ఇన్‌ఛార్జ్‌ అరవింద్‌ మీనన్‌, మరికొంత మంది నేతలు హాజరుకానున్నట్లు తెలిసింది. శిక్షణా తరగతుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ నేతలతో సమావేశమయ్యారు. మోడీ పర్యటన సక్సెస్‌, భవిష్యత్తులో ఎన్నికలే లక్ష్యంగా ఎలా ముందుకు పోవాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది.

- Advertisement -

మోడీ ఇచ్చిన బూస్ట్‌తో మరింత దూకుడుగా..

రాష్ట్రంలో మోడీ టూర్‌ సక్సెస్‌ కావడంతో బీజేపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు. బేగంపేట సభలో, రామగుండంలో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడిన తీరు చూస్తే గతంలో కంటే పూర్తి భిన్నంగా మోడీ ప్రసంగం ఉంది. ఈసారి డోస్‌ పెంచి సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. బేగంపేట సభలో అయితే ఆసాంతం విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికలో రాష్ట్ర బీజేపీ పోరాడిన తీరుపట్ల కూడా మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు చోట్ల సభా ఏర్పాట్లపై బండి సంజయ్‌ను అభినందించడంతో పాటు మరింత దూకుడుగా వెళ్లాలని మోడీ… బండి సంజయ్‌కు భుజం తట్టారు. ఈరకంగా మోడీ ఇచ్చిన ‘బూస్ట్‌’తో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం పక్యా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగరేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాదిపై ఎప్పటి నుంచో బీజేపీ దృష్టిసారిచింది. కానీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో అనుకూల పవనాలు కాస్త వీస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని నినాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. దక్షిణాదికి సంబంధించి కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అది కూడా బోటాబోటీ మెజార్టీతోనే. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి అక్కడ కాంగ్రెస్‌ గెలుస్తుందనే ప్రచారం సాగుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేరళ, తమిళనాడులో బీజేపీ బలపడడం కష్టమే. ఏపీలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో బీజేపీ ఆశలన్నీ ఇక తెలంగాణ రాష్ట్రంపైనే ఉన్నాయి. అందుకే టార్గెట్‌ 2023 లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా టీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఢిల్లి పెద్దల అండదండలతో రాష్ట్ర కమలనాథులు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పక్కా స్కెచ్‌తో…

కేసీఆర్‌ రెండు సార్లు సీఎం అయ్యారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీ చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా గెలిచింది. దాదాపు వంద మంది ప్రజాప్రతినిధులు మోహరిస్తే గానీ గెలిచిన పరిస్థితి అక్కడ. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గంలో ఈ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఒకేచోట ప్రచారం చేసే వీలుండదు కదా. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ గట్టి పోటీనే ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో రాబట్టేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను ఉపయోగించుకుని గెలుపే లక్ష్యంగా పక్కా స్కెచ్‌ గీసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలలో జరిగే శిక్షణా తరగతుల తర్వాత తెలంగాణలో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఎన్నికల ఎర కేసు విషయంలోనూ టీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను గట్టిగా తిప్పి కొట్టేందుకు ప్లాన్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఒక పక్క టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో గత బెంగాల్‌ తరహా పరిణామాలు రాష్ట్రంలో కనిపించినా ఆశ్చర్యం లేదనే చర్చ పొలిటికల్‌ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయం మరింత వాడివేడిగా ఉండనుందని రాజీకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement