Tuesday, November 26, 2024

Story | ఏపీలో పొత్తులపై క్లారిటీ.. బీజేపీ – టీడీపీ కలవని దారులు, తాజా పరిణామాలతో స్పష్టమవుతున్న వైఖరి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించేలోగా భారతీయ జనతా పార్టీతో పొత్తులపై స్పష్టత వస్తుందని ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఆ పార్టీతో పొత్తు ఆలోచన లేదంటూ ఇంతకాలంగా చెబుతున్న వైఖరే తుది నిర్ణయమని కాషాయదళ అధిష్టానం స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా ఎదగాలని కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కలిగేది తాత్కాలిక ప్రయోజనమే తప్ప దీర్ఘకాలంలో నష్టమేనని భావిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా 2014లో పొత్తుతో అధికారంలో బీజేపీ భాగం పంచుకుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేసి, క్రమంగా తన సొంతబలాన్ని పెంచుకుంటూ పోయింది. బిహార్‌లో జేడీ(యూ)తో తెగతెంపులు చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలోనూ శివసేనతో కలిసి అనేక దశాబ్దాలుగా సాగించిన ప్రయాణంలో శివసేనను అధిగమించి మరీ బలపడగలిగింది.

- Advertisement -

కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగించిన ప్రయాణం బీజేపీకి ఏమాత్రం మేలు చేయలేకపోయింది. 1998లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఏపీలో 2 పార్లమెంట్ సీట్లు గెలుపొందిన బీజేపీ, 1999లో టీడీపీతో పొత్తు ద్వారా రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి సీట్లను గెలుపొందింది. కానీ ఆ తర్వాత ఆ బలాన్ని కొనసాగించలేకపోయింది. రాజకీయాల్లో దూకుడుగా, గత నాయకత్వం అనుసరించిన విధానాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న మోదీ-షా ద్వయం.. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తోంది. దీర్ఘకాలంలో పార్టీకి ప్రయోజనం కల్గిస్తేనే పొత్తులు పెట్టుకోవాలని, లేదంటే ఒంటరిగానే ఎదగడానికి ప్రయత్నించాలని భావిస్తోంది. ఈ క్రమంలో జనసేనను కలుపుకుని రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కమలనాథులు అనుకున్నారు. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనను తమవైపు లాక్కునే ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. జనసేనాని సైతం ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారు. తన ప్రస్తుత లక్ష్యం రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీని ఓడించడమేనని, ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చవద్దని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యానించారు.

పరోక్షంగా మిత్రపక్షం బీజేపీని కూడా తెలుగుదేశంతో కలిసి నడవాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం మెత్తబడడం లేదు. 2018లో ఎన్డీయేను వీడి వెళ్లిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా తిరిగి చేసిన ప్రచారం, ఆ క్రమంలో చేసిన వ్యక్తిగత దూషణలను మోదీ-షా ద్వయం ఇంకా మర్చిపోలేదని కమలదళంలో అధిష్టానం పెద్దలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా వనరులు సమకూర్చుతూ ఆయువుపట్టులా వ్యవహరించిన కీలక నేతలు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు వంటి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్‌ను కూడా కలుపుకుని బీజేపీలో చేరినప్పటికీ, తెలుగుదేశం పార్టీతో సయోధ్య కుదర్చడమే లక్ష్యంగా వారంతా ప్రయత్నిస్తూ వచ్చారని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం అడిగినా, అడగకపోయినా పార్లమెంటులో అనేక కీలక బిల్లులకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తూ సంకేతాలు పంపుతూ వచ్చింది. తాజాగా జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేసింది. ఏమాత్రం అవకాశం చిక్కినా మోదీ-షా ద్వయాన్ని ఒప్పించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ యంత్రాంగం మొత్తం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

తెలుగుదేశం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే.. కమలదళం అగ్రనేతల్లో కాస్త కూడా మార్పు రాలేదని తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయాలకు, వైఖరికి ప్రతినిధులుగా చెప్పుకునే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, కో-ఇంచార్జి సునీల్ దేవధర్ సహా జాతీయ నాయకత్వంలో చాలా మంది నేతలు తెలుగుదేశంతో పొత్తుకు అవకాశం లేదని పలుమార్లు చెప్పారు. అయితే సాధారణంగా పొత్తుల రాజకీయాలన్నీ ఎన్నికలు సమీపించిన తర్వాతనే మొదలవుతాయి కాబట్టి, బీజేపీ నాయకత్వం సైతం అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటుందని, అది టీడీపీతో పొత్తులకు సానుకూలంగానే ఉంటుందని తెలుగుదేశం నాయకత్వం ఆశలు పెట్టుకుంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొత్తులకు ఏమాత్రం అవకాశం లేదన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైపెచ్చు తెలుగుదేశం చర్యలు సైతం బీజేపీ అగ్రనాయకత్వానికి కోపం తెప్పిస్తున్నాయి. ఓవైపు బీజేపీకి ఏపీలో 1 శాతం కూడా ఓటుబ్యాంకు లేదంటూ ఎద్దేవా చేస్తూనే మరోవైపు తమతో పొత్తు పెట్టుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ వెంటపడడం కమలనాథులకు నచ్చడం లేదు.

ఇదే సమయంలో బీజేపీలో ఉన్న తెలుగుదేశం అనుకూల వర్గం ఢిల్లీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ సైతం ఇదే తరహాలో అధిష్టానం పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప బీజేపీ ఎన్నో కొన్ని సీట్లు గెలుపొందే అవకాశం లేదని చెప్పినట్టు తెలిసింది. అందుకు నాయకత్వం అంగీకరించకపోవడంతోనే పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కన్నా తన కోణంలో రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ, ఆ వెంటనే టీడీపీలో చేరడం మోదీ-షా ద్వయానికి మరింత కోపం తెప్పించినట్టు సమాచారం. బీజేపీని మరింత బలహీనపర్చేందుకు చంద్రబాబు నాయుడు ఈ తరహా వ్యూహాలను అమలు చేస్తున్నారని వారిద్దరూ భావిస్తున్నారు.

‘ఆపరేషన్ కమలం’ పేరుతో బీజేపీలో తమకు అనుకూలంగా ఉన్న మరికొందరు నేతలను లాక్కునే ప్రయత్నాలు సాగుతున్నాయని అధిష్టానం పసిగట్టింది. పదవులు, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే నేతలు పార్టీ వీడినా నష్టం లేదన్న భావనతో అధిష్టానం ఉంది. ఈ క్రమంలో మరికొందరు నేతలు పార్టీని వీడినా పెద్దగా కలవరపడే పరిస్థితి అధిష్టానంలో కనిపించడం లేదు. అందుకే ఒకప్పుడు వైఎస్సార్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న కన్నా లక్ష్మీనారాయణను ఆపి, తమ పార్టీలోకి తీసుకొచ్చి, రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టిన కాషాయదళం.. ఇప్పుడు పార్టీని వీడి వెళ్తానని ముందే హెచ్చరించినా సరే పట్టించుకోలేదు. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.

మరోవైపు కన్నా తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలోనే ఏపీ బీజేపీ నేతలు దాదాపు పాతికమంది ఢిల్లీలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్‌ను కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యవహారశైలి కారణంగానే నేతలు పార్టీ వీడి వెళ్తున్నారని, అధ్యక్షుడిగా వీర్రాజును కొనసాగిస్తే పార్టీ మరింత నష్టపోతుందని అన్నారు. సోము వీర్రాజుతో పాటు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ నేతల బృందం రాక గురించి, వారు చెప్పబోయే అంశాల గురించి ముందే తెలిసినట్టుగా మురళీధరన్ వ్యవహరించడం నేతలకు మింగుడుపడలేదు. పైపెచ్చు వచ్చినవారితో మాట్లాడ్డమే ఇష్టం లేనట్టుగా వ్యవహరించారని, కనీసం కూర్చోబెట్టకుండా నిలబడే మాట్లాడారని కొందరు నేతలన్నారు.

ఇంతమంది ఎందుకొచ్చారంటూ మందలింపు ధోరణలో మాట్లాడారని మరికొందరు నేతలు చెప్పారు. ఏదిఏమైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇలా రచ్చ చేయడం తగదని, ఇది బీజేపీ సంస్కృతి కాదని నేతలకు హితవు పలికినట్టు తెలిసింది. మొత్తంగా అధిష్టానం ప్రతినిధి మురళీధరన్‌ వ్యవహారశైలితో వచ్చిన నేతలకు పార్టీ వైఖరేంటో స్పష్టమైంది. పార్టీ సొంతబలంతో గెలుపొందేలా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, పొత్తుల నిర్ణయాలు తీసుకునేది అధిష్టానమే తప్ప రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తలు వాటి గురించి ఆలోచించవద్దని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement