Saturday, September 7, 2024

Delhi | టార్గెట్ ఓవైసీ.. హైదరాబాద్ సీటూ గెలవాల్సిందే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మిషన్ 400 ప్లస్ లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలిచే అవకాశమున్న ప్రతి సీటుపైనా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో హైదరాబాద్ స్థానాన్ని సైతం గెలుపొంది తమ ఖాతాలో ఒక సీటు చేర్చుకోవడంతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వరుస విజయాలకు బ్రేకులు వేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ నియోజకవర్గంలో 1984 నుంచి ఓవైసీ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా 6 పర్యాయాలు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గెలుపొందగా.. 2004 నుంచి వరుసగా అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందుతూ వచ్చారు. 1996లో బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు పోటీ చేసినప్పటికీ.. సలావుద్దీన్ ఓవైసీ చేతిలో 73,273 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

ఈ ఏడు నియోజకవర్గాల్లో గోషామహల్ స్థానం ఒక్కటే బీజేపీ గెలుచుకుంది. మిగతా 6 స్థానాల్లో ఏఐఎంఐఎం పార్టీ నేతలే గెలుపొందారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ 50% మించి ఓట్లు సాధించినప్పటికీ, 2009లో 42 శాతం ఓట్లు, 2004లో 37 శాతం ఓట్లతోనే గెలుపొందారు. ఈ విజయ పరంపరకు అడ్డుకట్ట వేయడానికి విభిన్న వ్యూహాలతో ముందుకెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఆ ఓట్లు చీల్చి, ఈ ఓట్లు ఏకం చేయాలి

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హిందు – ముస్లిం జనాభా అటూఇటుగా సరిసమానంగా ఉన్నప్పటికీ ముస్లిం ఓట్లన్నీ ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీకి గంపగుత్తగా పడుతుండగా.. హిందూ ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోతున్నాయి. ఈ కారణంగానే ఓవైసీ కుటుంబం గత 4 దశాబ్దాలుగా ఓటమి ఎరుగకుండా గెలుపొందుతూ వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే.. హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటు ముస్లిం ఓట్లను చీల్చాల్సి ఉంటుంది. ఆ దిశగా కమలనాథులు వ్యూహాలు పన్నుతూ అడుగులు వేస్తున్నారు.

- Advertisement -

మొదటగా హిందూ ఓట్లను ఏకం చేయడం కోసం రాష్ట్రంలో హిందూ ఐకాన్‌గా పేరొందిన నేతను బరిలోకి దించాలి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా హిందుత్వవాదులుగా పేరొందిన బీజేపీ నేతల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇద్దరు నేతల్లో ఎవరిని బరిలోకి దించినా హిందూ ఓట్లను ఏకం చేయగలిగే శక్తి ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండగా… ఈసారి కూడా అక్కణ్ణుంచే బరిలోకి దిగేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ స్థానంపై బీజేపీలో మరికొందరు నేతలు కన్నేసినప్పటికీ బండి సంజయ్‌ను కాదని మరొకరికి ఆ సీటును అప్పగించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు.

దీంతో రాజాసింగ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ అంతటా పరిచయం అవసరం లేని నేత రాజాసింగ్. హిందూ అతివాదంతో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా పార్టీ అధిష్టానం రాజాసింగ్‌పై కొన్నాళ్లు సస్పెన్షన్ వేటు వేసింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ గోషామహల్ నుంచి బరిలోకి దించింది.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్థానాలు మాత్రమే గెలుపొందగా, పార్టీకి పట్టున్న హైదరాబాద్ నగరంలో గోషామహల్ ఒక్కటి మాత్రమే నిలుపుకోగలిగింది. మిగతా 7 స్థానాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి సాధించినవే ఉన్నాయి. గెలుపొందినవారిలో రాజాసింగ్ సీనియర్ అయినప్పటికీ శాసనసభాపక్ష నేతగా ఆయనకు పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంటు బరిలో దించి గెలుపొందితే జాతీయస్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవచ్చని పార్టీ భావిస్తోంది. పైగా సింధీ కుటుంబానికి చెందిన రాజాసింగ్‌ను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా దేశంలో సింధీల సంఖ్య ఎక్కువగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి ఉపయోగించుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది.

హిందూ ఓట్లను ఏకం చేయడానికి రాజాసింగ్ అభ్యర్థిత్వం ఉపయోగపడినా.. ముస్లిం ఓట్లను చీల్చకపోతే గెలుపు కష్టతరంగా మారుతుంది. అందుకే ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఎంఐఎంకు పోటీగా ఎంబీటీ నుంచి బలమైన అభ్యర్థి బరిలోగి దిగేలా కమలం పార్టీ తెరవెనుక పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు ఇతరత్రా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఓవైసీ బలాన్ని 40 శాతం కంటే తక్కువకు పరిమితం చేయగల్గితే బీజేపీ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న హిందూ ఓటర్లు పోలింగ్ తేదీన నిరాసక్తత ప్రదర్శించడం కూడా ఓవైసీకి లాభిస్తోందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

ఈసారి ఎన్నికల్లో హిందూ ఓటర్లందరినీ పోలింగ్ బూత్ వరకు తీసుకురాగల్గితే సగం విజయం సాధించినట్టేనని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం గెలుపొందలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయస్థాయిలో ప్రధాన మంత్రిని నిర్దేశించే ఎన్నికలు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఆ పోటీ ఎంఐఎం – బీజేపీ మధ్యనే ఉండేలా పరిస్థితులు సృష్టించాలని చూస్తున్నారు. ఇలా బహుముఖ వ్యూహంతో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందడంతో పాటు హైదరాబాద్ స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement