హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటుకు గత కొంత కాలంగా బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. బుధవారం సాయంత్రం వరకు ప్రధాని పర్యటనలో పార్టీ శ్రేణులతో భేటీ లేకపోయినప్పటికీ ఆఖరి నిమిషంలో షెడ్యూల్ మార్చేలా ప్రధాని కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన రాష్ట్ర నేతలు చివరకు అనుకున్నది సాధించారు. బుధవారం రాత్రి పీఎంవో కార్యాలయం వెలువరించిన బులెటిన్ ప్రకారం మోడీ పర్యటన షెడ్యూల్‌లో బీజేపీ శ్రేణులతో సభ అంశం అసలే లేదు. అంతేకాకుండా పీఎంవో కార్యాలయం ప్రకటించిన షెడ్యూల్ టైం కంటే ముందుగానే ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. పీఎంవో కార్యాలయం పేర్కొన్న ప్రకారం ప్రధాన మంత్రి మధ్యాహ్నం గం. 1.25లకు చేరుకోవాల్సి ఉంది. కానీ మోడీ గం. 12.50లకే హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదికపై నుంచి దాదాపు అరగంట పాటు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. ప్రధాని తన ప్రసంగంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఉద్దేశించి కఠువైన వ్యాఖ్యలు చేస్తూ శ్రేణుల్లో జోష్ పెంచారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న పార్టీ నేతలు..
ప్రధాని చివరి నిమిషంలో తన షెడ్యూల్‌ను మార్చుకోవడం, నిర్ణీత సమయం కంటే ముందుగానే హైదరాబాద్‌కు చేరుకుని పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపేలా ప్రసంగించడం పట్ల బీజేపీ రాష్ట్ర నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం శ్రేణులను సమాయాత్తం చేయడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. రెండు విడతల ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడం,ఈ యాత్రకు కేంద్ర పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు కోరిన వెంటనే జాతీయ స్థాయి నేతలు బహిరంగసభలకు హాజరవడం చూస్తుంటే రాష్ట్రంలో పార్టీ విస్తరణ పట్ల ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లం చేస్తోందని చెబుతున్నారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడి అభినందనలను తెలపడం, ఇప్పుడు కోరిన వెంటనే సమయమిచ్చి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటం చూస్తుంటే రాష్ట్రంలో పార్టీకి మంచి భవిష్యత్ ఉందని, కాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న అభిప్రాయం కేంద్ర నాయకత్వంలో ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెబుతున్నారు.
ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్విగ్న వాతావరణం..
గురువారం ఉదయం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్ళేందుకు ఉదయం ఎయిర్‌పోర్టుకు రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు తండోపతండాలుగా ఎయిర్‌పోర్టుకు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన పోలీసులలో స్పష్టంగా కనిపించింది. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే ఆయనకు స్వాగతం చెప్పాల్సిన సీఎం బెంగళూరుకు వెళ్ళడంపై బీజేపీ శ్రేణులు నిరసన తెలిపే అవకాశాలున్నాయన్న పుకార్లు రావడంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలలో బారికేడ్లను పెట్టి కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మరో పక్క ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నిరసన తెలిపేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వస్తున్నారన్న సమాచారంతో మరింత అప్రమత్తమై ఎప్పుడు ఏం జరుగుంది, ఏ క్షణంలో ఏ వైపు నుంచి నిరసనలు వ్యక్తమవుతాయన్న ఆదుర్ధ పోలీసులలో స్పష్టంగా కనిపించింది. సీఎం బెంగళూరుకు వెళ్ళడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పోలీసులు ప్రధాని పర్యటన సాఫీగా జరగడంతో రిలాక్స్ అయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..