Tuesday, November 26, 2024

రేపటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. పార్టీ బలోపేతంపై చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారం నుంచి పాలమూరులో (మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం)లో ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్‌లో సమావేశాలు నిర్వహించనున్నారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి. 23న సోమవారం మధ్యాహ్నం ప్రారంభమై 24న సాయంత్రం వరకు రెండు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ నేతలు, వివిధ మోర్చాల నేతలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాలమూరు బాటపట్టనున్నారు.

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పలు అంశాలపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతంచేయడం ఎలా..?, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి..?, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో అనుసరించాల్సిన రాజకీయవ్యూహం, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాలు, క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలకు పాలమూరు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వేదికగా దిశానిర్దేశం వెలువడనుంది. పాలమూరు నుంచి పోటీ చేయాలని ప్రధాని మోడీని కోరుతూ తీర్మాణాన్ని ఆమోదించే అవకాశాలు కూడా లేకపోలేదని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

పాలమూరు నుంచి మోదీ పోటీ చేయాలని కోరిన నేతలు..

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రధాని మోడీని బీజేపీ రాష్ట్ర నేతలు కోరిన నేపథ్యంలో పాలమూరులో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాలమూరులో పట్టు బిగిస్తే తప్ప అధికారంలోకి రాలేమనే నిర్ణయానికి కేంద్ర నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. పాలమూరు ప్రాంతం దక్షిణ భారతదేశానికి గేట్ వేగా ఉండడంతో ఇక్కడ పట్టుసాధించి మొత్తం దక్షిణాది రాజకీయాలను ప్రభావితం చేయాలన్న వ్యూహంలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అందులో భాగంగానే మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోడీని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. పాలమూరుకు ఓ వైపు కర్ణాటక, మరోవైపు ఏపీ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండడం, తమిళనాడుకు కూడా సులువుగా యాక్సెస్‌ చేసే వీలు ఉండడంతో పాలమూరు ఎంపీ స్థానం బీజేపీ దృష్టిలో ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ప్రధాని మోడీ పాలమూరు నుంచి పోటీ చేస్తే జిల్లాలో పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయొచ్చని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కుతుందని, శంషాబాద్‌-బెంగళూరు వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి చెందుతుందని, అనేక పరిశ్రమలు వస్తాయని తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని, పాలమూరు నుంచి వలసలు ఆగుతాయని బీజేపీ రాష్ట్ర, పాలమూరు నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement