కరోనాను అదుపు చేయడంలో ఏపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాజ్యాంగం ప్రచారం వైద్య, పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం, ఆసుపత్రుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. దీని ప్రకారం కోవిద్ నిర్వహణ, వాక్సిన్ల సేకరణ రాజ్యాంగబద్దంగా రాష్ట్ర ప్రభుత్వాలదే అని స్పష్టం చేశారు. వాక్సిన్లు సేకరించాల్సిన బాధ్యత తనపై ఉంటే, కేంద్రమే కొనాలని కోరుతూ ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కేంద్రాన్ని బాధ్యులను చేస్తున్నారని విమర్శించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని ఎంతో బాధ్యతగా కోవిద్ పట్ల ఫిబ్రవరి, మార్చిలలో సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రులను అప్రమత్తం చేశారని గుర్తు చేశారు. కాని ముఖ్యమంత్రి జగన్, వైద్యశాఖమంత్రి, అధికారయంత్రాంగం ఒక్క సమావేశం నిర్వహించలేదని, కేంద్రం నుంచి వచ్చిన మందులు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు సరిగా వినియోగించలేదని ఆరోపించారు. కోవిద్ నియంత్రణపై ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట ప్రణాళిక లేదని, లోపభూయిష్ట విధానాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
కేంద్రం ముందుగానే అప్రమత్తమై ఏప్రిల్ 6న సుమారు 5 వేల వెంటిలేటర్లను ఏపీకి ఇచ్చిందన్నారు. కానీ వాటిని సరిగా వినియోగించలేదన్నారు. 15.60 లక్షల ఎన్. 95 మాస్కులు, 3.91 లక్షల పీపీఈ కిట్లు, 3.67 లక్షల రెమిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చిందన్నారు. 11,230 బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఇచ్చిందని వివరించారు. మే 1న విడుదల చేసిన వాక్సినేషన్ పాలసీలో మొత్తం వాక్సినేషన్ ఉత్పత్తిలో 50 శాతం కేంద్రం తీసుకుని ఉచితంగా ఇస్తే, 50 శాతం రాష్ట్రాలు సొంతంగా సేకరించుకుని వాటిని ఉచితంగా ప్రజలకు చేయాలని పేర్కొందని తెలిపారు.
దేశవ్యాప్తంగా జూన్ 5 నాటికి 25 కోట్ల డోస్‌లు ఉత్పత్తి చేసి 24 కోట్ల డోస్‌లు పంపిణి చేయగా ఏపీ ఒక్కడోస్ కొనలేదని ఆరోపించారు. సీఎం జగన్ గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఒక్క కంపెనీ పాల్గొనలేదన్నారు. 18-44 ఏళ్ల మధ్య వారికి దక్షిణ భారతదేశంలో మొత్తం 2.76 కోట్ల మందికి మొదటి డోస్ ఇచ్చారన్నారు. 1.61 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నారు. ఏపీలో మాత్రం ప్రైవేటు సంస్థల చెల్లింపు ప్రక్రియ ద్వారా మాత్రం సుమారు 60 లక్షల వాక్సిన్లు మాత్రం వేశారన్నారు. కర్నాటకలో 19.3 లక్షలు, తమిళనాడులో 18.4 లక్షలు, తెలంగాణలో 6.1 లక్షలు, కేరళలో 5.2 లక్షలు వేశారని సోము వీర్రాజు తెలిపారు.