తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిన్న ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హసన్ కూడా పోటీ చేశారు. అయితే, కమల్ కుమార్తె, నటి శృతి హసన్‌పై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్దంగా ఆమె తన తండ్రితో కలిసి కోయంబత్తూరు సౌత్‌లోని పోలింగ్ బూత్‌ను అక్రమంగా సందర్శించినట్లు ఆరోపించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం చీఫ్ కమల్ హసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటేసిన అనంతరం ఆయన.. తన కూతుళ్లు అక్షర, శృతి హసన్‌తో కలిసి నేరుగా కోయంబత్తురు సౌత్ నియోజకవర్గానికి వెళ్లారు. ఓటింగ్ సరళిని సమీక్షించడానికి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో కమల్ హసన్ వెంట శృతి హసన్ కూడా ఉండటంతో.. ఆమె అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ నేత నందకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు.