Friday, November 22, 2024

నాలుగు రాష్ట్రాల్లో గెలుపు మాదే : కే.లక్ష్మణ్..

త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపు తమదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ చేరుకున్న అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన డా.లక్ష్మణ్, ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారునే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో 70, యూపీలో 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు అప్పగించారని ఆయన తెలిపారు. 5 రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల పవనాలు ఉన్నాయని, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో మోదీ-యోగి, ఉత్తరాఖండ్‌లో మోదీ-ధామి డబుల్ ఇంజిన్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డా. లక్ష్మణ్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం మాఫియా పనిపట్టి, కనిపించకుండా చేసిందని అన్నారు. తద్వారా గూండారాజ్ నుంచి ప్రజలకు విముక్తి లభించిందని, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతుల మేలు కోసం యోగి ప్రభుత్వం రూ. 36 వేల కోట్లతో 86 లక్షల మందికి రుణ మాఫీ చేసిందని, మరోవైపు కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం అందజేస్తోందని గుర్తుచేశారు. 43 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించినట్టు వివరించారు. 4.5 లక్షల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగా, 2 కోట్ల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయని గణాంకాలు వెల్లడించారు. ప్రభుత్వం విద్యార్థులకు టాబ్‌లు, విద్యార్థినులకు ఉచిత విద్య అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 75 మెడికల్ కళాశాలలు ఉన్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందుతోందని చెప్పారు. మూతబడిన 20 చక్కెర కర్మాగరాలు తెరిచి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. ఈ పరిస్థితిని గమనించిన అనేక మంది బీఎస్పీ, ఎస్పీ నేతలు బీజేపీలో చేరుతున్నారని డా. లక్ష్మణ్ అన్నారు. రామ మందిర నిర్మణం, భవ్య కాశి దివ్య కాశి, భవిష్యత్‌లో మధుర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న అభిప్రాయం యూపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడిందని అన్నారు.

ప్రతిసారీ ఓట్లు వేసి గెలిపించేందుకు తప్ప ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్న ఓబీసీలకు తమ పార్టీ పెద్దపీట వేసిందని, కేంద్ర కేబినెట్‌లో అత్యధిక సంఖ్యలో ఓబీసీలకు మోడీ ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించిందని డా. లక్ష్మణ్ గుర్తుచేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని, పంజాబ్‌లో మెరుగైన స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ నామ మాత్రపు పార్టీగా తెలంగాణలో మిగిలిపోతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణలో బీజేపీ మాత్రమే నిలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతలపై దాడులను రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగిపోయిందని డా. లక్ష్మణ్ అన్నారు. ఇది గమనించి, ఆక్రోశం తట్టుకోలేకనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారని డా. లక్ష్మణ్ ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement