రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లో బీజేపీ ఎంపీ రంజిత కోలి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుంది. కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న ఎంపీ కారుపై రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడులకు తెగబడ్డారు. దీంతో ఆమె వాహనం ధ్వంసం అయింది. అయితే ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు.. ఇనుప రాడ్‌లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో వాహనం అద్దాలు పగలగొట్టారు. ఈ దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన గురయ్యారు. వారి దాడిలో ఎంపీకి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్‌లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు.