Tuesday, November 26, 2024

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ.. తుని ఘటనలో కాపు గర్జన నేతల హస్తం లేదని వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లోని తునిలో 2016లో జరిగిన కాపు గర్జన మహాసభ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇంకా కొనసాగుతున్న 2 కేసులను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని కోరారు. రైల్వే శాఖ పరిధిలోని రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఇప్పటికే 5 కేసులను ఉపసంహరించుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాపు నాయకులపై నమోదైన కేసులు (నం.17/2016, 77/2016)ను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతూ కాపులు చేపట్టిన కాపు గర్జన కార్యక్రమంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం, రైల్వే ఆస్తులకు నష్టం కల్గించడం వంటి హింసాత్మక ఘటనల్లో కాపు నాయకుల పాత్ర లేదని, ఈ ఆందోళనకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు నేరస్థులు, అసాంఘీక శక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని జీవీఎల్ పేర్కొన్నారు.

ఈ విషయం అప్పటి పత్రికల్లో ప్రచురితమైందని, న్యూస్ ఛానెళ్లలోనూ విస్తృతంగా ప్రసారమైందని గుర్తుచేశారు. పైన పేర్కొన్న రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాపు నేతలు ఈ ఆరేళ్ల కాలంలో మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు కేసుల విషయంలో అవసరమైతే ట్రయల్ కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేయాలని, శాంతియుత ఆందోళనలకు నాయకత్వం వహించిన కాపు నేతలకు ఉపశమనం కల్పించాలని జీవీఎల్ అభ్యర్థించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement