అవినీతిపరుల్ని ఎన్డీఏ సర్కారు బట్టబయలు చేసిందని, రాబోయే అయిదేళ్లలో అవినీతిపరులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్‌లోని గుమ్లాలోని సిసాయిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్,ఇండియా బ్లాక్ పార్టీలు అవినీతిపరులకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నట్లు ఆరోపించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జైల్లో ఉన్నాడని, అవినీతిని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే అయిదేళ్లలో అలాంటి వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు.
ఇండియా కూటమి నేతలు పీకల్లోతు అవినీతిలో ముగినిపోయారని, అవినీతిపరులకు మద్దుతగా వాళ్లు ఢిల్లీ, రాంచీల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారని, వాళ్ల నిజ స్వభావాన్ని వాళ్లే బయటపెట్టుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. గిరిజన జిల్లాలు వెనుకబడి పోవటానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఆహార ధాన్యాలను కేవలం గోడౌన్లకే పరిమితం చేసినట్లు ఆరోపించారు. దీని వల్ల గిరిజన పిల్లలు ఆకలి బాధతో చనిపోయినట్లు చెప్పారు. పేదలకు ఉచిత రేషన్ ఇచ్చే స్కీమ్‌ను ఎవరూ అడ్డుకోలేరని ప్రధాని మోదీ అన్నారు.
పేదల ప్రజలకు ఇంటర్నెట్ అందే సౌకర్యాన్ని ఎన్డీఏ సర్కారు కల్పించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్నెట్ కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేదన్నారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మావోయిస్టు సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.