న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌ను కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు ఢిల్లీ చేరుకున్న ఆయన, గురువారం మధ్యాహ్నం తరుణ్ చుగ్‌ను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ఓవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తుండగా, ఈటల రాజేందర్ ఢిల్లీ చేరుకుని పార్టీ పెద్దలతో మంతనాలు సాగించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో తనకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్న ఈటల, ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పేందుకు ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో చేపడుతున్న పార్టీ కార్యకలాపాలకు మొక్కుబడిగా ఆహ్వానించడం తప్పితే అధికార టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఈటలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదన్న చర్చ కూడా ఇప్పటికే జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన మరికొందరు నేతలు సైతం ఇదే తరహాలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. నాగం జనార్థన్ రెడ్డి వంటి నేతలు ఇమడలేకనే పార్టీని వీడి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో ఈటల తన వర్గం నేతలతో కలిసి ఢిల్లీ చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్‌ను కలిసిన ఆయన, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అమిత్ షా ఈ నెల 14న తెలంగాణ పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో, అంతకంటే ముందే కలవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి జాతీయ నేతలు ఎవరొచ్చినా, విడిగా కలిసే అవకాశం ఉండడం లేదని, అందుకే పనిగట్టుకుని ఢిల్లీ వచ్చి మరీ పార్టీ పెద్దలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఈటల వర్గం నేతలు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి