మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే దారుణానికి పాల్పడ్డాడు. విచక్షణ రహితంగా శివసేన నేతపై కాల్పులు జరిపాడు. గత కొద్దికాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేశ్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్‌లతో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గణ్‌పత్ గైక్వాడ్.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇక, కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే పోలీసులు స్పందించి గాయపడిన వారిని థానేలోని జూపిటర్ హాస్పిటల్‌కు తరలించారు. గణ్‌పత్ గైక్వాడ్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక, శివసేన మద్దతుదారులు ఆస్పత్రి దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.