న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో బీజేపీ ఓడిపోయిన 144 పార్లమెంట్ నియోజకవర్గాలపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటిలో చాలా చోట్ల బీజేపీ ద్వితీయ స్థానంలో నిలవగా, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొని కొద్ది తేడాతో తృతీయస్థానంలో నిలిచిన స్థానాలు కూడా ఉన్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గాల్లో కూడా గెలుపొందేలా వ్యూహాలు రచిస్తే.. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. 2019లో గెలుపొందిన నియోజకవర్గాల్లో అభ్యర్థిపై వ్యతిరేకత తదితర కారణాలతో కొన్నింటిని కోల్పోయినా.. ఈ 144 స్థానాల్లో గెలుపొందేవాటితో భర్తీ చేసుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది తేడాతో ఓటమిపాలవ్వడానికి గల కారణాలపై మంత్రుల బృందం ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి ఇప్పటికే నివేదికలు అందజేసినట్టు సమాచారం.
లోపాలు, బలహీనతలు, వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, మార్పుచేర్పులు, స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారని, మంగళవారం నాటి సమావేశం ప్రధానంగా వీటిపైనే సమీక్ష జరిపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.