Tuesday, November 19, 2024

మ‌రికొద్ది రోజుల్లో బీజేపీ మేనిఫెస్టో.. నరేంద్ర మోడీ గ్యారంటీ స్కీమ్‌ల పేరుతో విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సాధారణంగా అసెంబ్లి ఎన్నికలైనా, సార్వత్రిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా పార్టీలకు మేనిఫెస్టో ఎంతో కీలకం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లి ఎన్నికల మేనిఫెస్టోపై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. అసెంబ్లి ఎన్నికల కార్యాచరణలో భాగంగా బీజేపీ ప్రధానంగా అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదలపై దృష్టి సారించింది.

ఇప్పటికే దాదాపు 30మందితో కూడిన తొలి విడత జాబితా ముసాయిదా అధిష్టానం ఆమోదం కోసం పంపడంతో ఇక… మిగిలింది కీలకమైన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై డ్రాఫ్ట్‌ను రూపొందించిన బీజేపీ… ఈ నెల 20న మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ పకడ్బంధీగా మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో విజయవంతమవడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ ఏకంగా 48 కార్పోరేటర్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించిన అనుభవం ఉన్న జి.వివేక్‌ని ఈసారి కూడా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది బీజేపీ.

- Advertisement -

మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా బీజేపీ మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు. రైతులు, యువత, మహిళలను ఆకట్టుకునే పథకాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ మేనిఫెస్టోకు ఇంద్ర ధనుస్సు పేరు పరిశీలనలో ఉంది. నరేంద్ర మోదీ గ్యారంటీతో మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించనుంది. మేనిఫెస్టోలో విద్య, వైద్యం, రైతు, మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీఠ వేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ లేదా హోంమంత్రి అమిత్‌ షాతో మేనిఫెస్టోను రిలీజ్‌ చేయించనున్నారు. మేనిఫెస్టోలో రైతు, మహిళా, యువ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు హామీలను గుప్పించబోతోంది. విద్యా, ప్రజా ఆరోగ్యం, ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి సారించింది. ఎస్సీఎస్టీబీసీలపై మేనిఫెస్టో కమిటీ మెయిన్‌గా ఫోకస్‌ పెట్టింది. మొత్తంగా యువత, నిరుద్యోగులు, రైతు, ప్రజా ఆరోగ్యం, ఉచిత విద్య, ఉద్యోగుల సంక్షేమం, ఎస్సీఎస్టీ, బీసీలపై ప్రధానంగా ఫోకస్‌ చేస్తోంది.

ఒకవైపు అధికార బీఆర్‌ఎస్‌ త్వరలోనే మేనిఫెస్టోను విడుదల చేయబోతుండగా… ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఇప్పటికే ఆరు గ్యారంటీలతో దాదాపూ మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోనే కాంగ్రెస్‌ ఎన్నికల బరిలోకి దిగనుంది. దీంతో అటు అధికార బీఆర్‌ఎస్‌, ఇటు ప్రత్యర్థి కాంగ్రెస్‌లకు ధీటుగా మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేయనున్నట్లు సమాచారం. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను, మన్నననలను పొందేవిధంగా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.

మేనిఫెస్టోలో ప్రధానంగా రైతు సంక్షేమానికి పలు హామీలను ఇవ్వనున్నట్లు చెప్పారు. అధికార బీఆర్‌ఎస్‌పై, ప్రత్యర్థి కాంగ్రెస్‌పై ఏయే వర్గాలు అసంతృప్తితో ఉన్నాయో మేనిఫెస్టోలో పలు హామీలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాలను బీజేపీకి దగ్గర చేసుకునేలా మేనిఫెస్టో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బీసీల సంక్షేమానికి కూడా మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి ఏం చేస్తామో వివరిస్తూ మేనిఫెస్టో ఉండనుంది.

అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిగా మేనిఫెస్టో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ నియమించిన వివిధ ఎన్నికల కమిటీల నుంచి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలోని కమిటీ సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement