న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను అక్టోబర్ రెండవ వారంలో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోందని తెలిపారు. రోజుల వ్యవధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రెండు సార్లు పర్యటించడం సహా పార్టీ కార్యక్రమాల గురించి అమిత్ షాతో చర్చించినట్టు తెలిపారు.
అక్టోబర్ 10న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన వరాలపై మాట్లాడుతూ.. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం జులైలో భూమిని అప్పగించిందని తెలిపారు. ఆ వెంటనే కేంద్రం వెంటనే దానికి ఆమోదముద్ర వేసిందని అన్నారు. ములుగులో ‘సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం’గా పేరు పెట్టడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని తెలిపారు. మరోవైపు 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నిజామాబాద్ పసుపు బోర్డు డిమాండ్‌ను తమ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు.
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే 800 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి నాటికి మరో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ సభను పసుపు రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు సభకు విశేషమైన ప్రజాదరణ లభించిందని తెలిపారు.
అమిత్ షా సహా అనేక మంది కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్, నవంబర్ మొదటి వారం లోపు 30 సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయన్నారు. అక్టోబర్ 5న జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జులు, రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుందని, 6న స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. అన్ని అసెంబ్లీ కన్వీనర్లు, ఇంచార్జులతో మొత్తం 800 మందితో సమావేశం ఉంటుందని వివరించారు. 5 తేదీ సమావేశానికి సునీల్ బన్సల్, 6 తేదీ సమావేశానికి జేపీ నడ్డా హాజరవుతారని చెప్పారు.