Saturday, November 23, 2024

Delhi | ఏపీలో వచ్చేది బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే : సీఎం రమేశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భాగస్వామ్యంతో ఉండే ప్రభుత్వమేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ అన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రానికి త్వరలోనే మంచిరోజులు వస్తాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల గురించి తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్రంలో వచ్చేది మాత్రం బీజేపీ భాగస్వామ్యం కల్గిన ప్రభుత్వమేనని తాను కచ్చితంగా చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఇకపోతే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచకాలు శిశుపాలుడి తప్పుల్లా పెరిగిపోతున్నాయని, వాటిని క్షమించే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంశాఖ మొత్తం గమనిస్తోందని సీఎం రమేశ్ అన్నారు.

కోడి కత్తి ఘటనలో ఎలాంటి కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు నివేదిక సమర్పించిందని చెబుతూ.. ఎన్నికల్లో సానుభూతి కోసమే ఇదంతా చేశారన్న విషయం స్పష్టమైందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దీని గురించి చర్చ జరగకుండా ఉండడం కోసమే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు తమ అధినేత అనుమతితోనే మాట్లాడుతున్నారని అన్నారు. ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలిసి గీతం విద్యాసంస్థ మీద దాడికి దిగారని ఆరోపించారు. జగన్ పుట్టకముందు నుంచే మార్గదర్శి సంస్థ ఉందని, ఇంతవరకు ఏ ఒక్క వినియోగదారుడు కూడా ఫిర్యాదు చేయలేదని రమేశ్ అన్నారు. కేవలం కక్ష సాధింపు కోసమే మార్గదర్శిపై కేసులు, విచారణతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సీఐడీ అధికారులు పనిగట్టుకుని ఢిల్లీకి వచ్చి మరీ ప్రెస్ మీట్లు పెట్టడం ఇందులో భాగమేనని అన్నారు.

ప్రజలకు, రైతులకు మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రాష్ట్రానికి ఏ పరిశ్రమ రావడం లేదని విమర్శించారు. అక్రమ లేఔట్లతో వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న లేఔట్లలో 90% అనధికారికంగా ఉన్నవేనని, వాటిలో ఒక్కటైనా ఆపారా అని ప్రశ్నించారు. ఓవైపు మద్యపాన నిషేధం చేస్తామని చెబుతూ మరోవైపు మద్యాన్ని ఏరులై పారిస్తూ జనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. జనానికి పథకాల పేరుతో ఓ పక్క రూ. 10 ఇచ్చి, మరోవైపు రూ. 100 లాక్కుంటున్నారని, వారు ఇదంతా గమనిస్తున్నారని, వైఎస్సార్సీపీ ఆటలు ఇక సాగవని సీఎం రమేశ్ హెచ్చరించారు.

అధికారులూ.. జాగ్రత్త..

వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పోలీసులు మితిమీరి సహకరిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుందన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అధికారుల తీరుపై విచారణ జరిపి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రమేశ్ హెచ్చరించారు. వైఎస్సార్సీపీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ అన్ని విషయాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి చర్చించానని సీఎం రమేశ్ వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement