Friday, November 22, 2024

పవన్ ప్రత్యేక విమానం.. జగన్ సైకిల్

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన మండిపడ్డారు. బీజేపీ- జనసేన కవాతు చూసి వైకాపా మంత్రులు చెవాకులు పేలుతున్నారని.. వైకాపా మంత్రులు పిరికిపందల్లా కనపడుతున్నారని వ్యాఖ్యానించారు. కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా అసలు పనికిరారని.. మంత్రులందరూ సీఎం జగన్ ఇంటి పని మనుషుల్లా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్, సునీల్ దేవ్‌ధర్‌లను ఏకవచనంతో విమర్శిస్తున్నారని.. పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.


పవన్ ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని విమర్శించే వైసీపీ నేతలు.. మరి సీఎం జగన్ సైకిల్ మీదేమైనా తిరుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజల సొమ్ముతో సీఎం జగన్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉందని విమర్శించే వాళ్ళు కళ్ళు కనపడని, చెవులు వినపడని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని మండిపడ్డారు. తిరుపతిలో బీజేపీని ఎదుర్కోవటానికి 10 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు మకాం వేశారని.. రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఓటుకి 2వేల రూపాయలు పంచాలని వైసీపీ తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటన్నారు. వైసీపీ వాళ్లు బినామీని తీసుకొచ్చి గ్లాస్ గుర్తు తెప్పించుకున్నారన్నారు. రామ తీర్థం, అంతర్వేది ఘటనల్లో హోంమంత్రి అసమర్ధతను మీరే చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆందోళన చేశాకే దేవాలయాల్లో సీసీ కెమెరాలు వచ్చాయన్నారు. బీజేపీ నేతలు విగ్రహాలు కూల్చితే కేసులు పెట్టాలని లేదా హోం మంత్రిని రాజీనామా చేయమనాలని సవాల్ విసిరారు. జగన్ సర్కారుకు దమ్ముంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement