తిరుపతి ఉపఎన్నిక వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై మరోసారి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ ఆరోపణలు చేశారు. గురుమూర్తి హిందువు కాదంటూ మరో నిజాన్ని ఆయన బయటపెట్టారు. నామినేషన్ వేయడానికి ముందు చర్చికి వెళ్లి ఫాదర్ ఆశీస్సులు తీసుకుంటున్న గురుమూర్తి ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏపీ ప్రజలను వైసీపీ చీట్ చేస్తుందని సునీల్ దేవధర్ ఆరోపించారు. చట్టప్రకారం ఎస్సీ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఎలా పోటీ చేస్తాడని ఆయన ప్రశ్నించారు. ఎస్సీగా ముద్ర వేసుకున్న గురుమూర్తి తిరుపతిలో పోటీ చేయడానికి అనర్హుడని విమర్శించారు. వైసీపీ దాచి ఉంచిన నిజాన్ని బీజేపీ-జనసేన బయటపెట్టిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే ఇటీవల వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువు కాదని, ఒక్కసారి కూడా తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేదని, ఎస్సీ హిందువుగా తనను తాను చెప్పుకుంటున్న గురుమూర్తి ఓ క్రైస్తవుడని సునీల్ దేవధర్ తీవ్ర ఆరోపణలు చేయగా.. తాను హిందువునే అంటూ డాక్టర్ గురుమూర్తి ఆధారాలను విడుదల చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్నప్పటి వీడియోతో పాటు నామినేషన్ దాఖలు చేసే ముందు గ్రామదేవతకు పూజలు నిర్వహించిన ఫొటోలను గురుమూర్తి విడుదల చేసిన సంగతి తెలిసిందే.