న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ / లింగ బలిజ, ఆరె మరాఠాతో పాటు 40 సామాజిక వర్గాలు త్వరలో జాతీయ ఓబీసీ జాబితాలో చేరనున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో లింగాయత్ తో పాటు వివిధ సంఘాల నేతలు ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో గురువారం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉండి ఇప్పటివరకు ఓబీసీ జాతీయ జాబితాలో పలు కులాలకు చోటు దక్కలేదని, అవన్నీ సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నాయని, ఆ కులాలను వెంటనే ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని కమీషన్ చైర్మన్ కు డా. కె.లక్ష్మణ్ వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. బీసీలను కేవలం నరేంద్ర మోదీ మాత్రమే గుర్తించి రాజకీయ, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో లక్షలాదిగా ఉన్న లింగాయత్ లు ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార జేనవాడే సంగప్ప తెలిపారు. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఆయన అన్నారు. కేంద్రమంత్రి వర్గంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. రాష్ట్రంలో బీసీలుగా ఉండి కేంద్ర జాబితాలో లేని లింగాయత్, ఆరే మరాఠాతో పాటు పలు కులాలకు జాతీయ ఓబీసీ జాబితాలో మోదీ ప్రభుత్వం కచ్చితంగా చేర్చుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాము కమిషన్ చైర్మన్ కు వివరించామని, త్వరలోనే ఈ వర్గాలు ఓబీసీలో జాబితాలో చేరడం ఖాయమని చైర్మన్ హామీ ఇచ్చారని సంగప్ప చెప్పారు.
భేటీలో పాల్గొన్న లింగాయత్ సంఘం ప్రతినిధి అశోక్ ముస్తాపురే మాట్లాడుతూ లింగాయత్ లకు ఓబీసీలో వెంటనే చేర్చాలని కోరారు. కేంద్ర ఓబీసీ జాబితాలో లేని కారణంగా జాతీయ విద్యాసంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ సామాజిక వర్గం అవకాశం కోల్పోతుందని ఆయన వివరించారు. గతం లో కూడా తాము కేంద్ర మంత్రివర్యులు అమిత్ శతో భేటీ అయి తమ డిమాండ్ వివరించామని చెప్పారు. మోదీ గారి ప్రభుత్వంలోనే తమకు న్యాయం జరుతుందన్న విశ్వాసాన్ని అశోక్ వ్యక్త పరిచారు
ఈ భేటీలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, మోర్చా ప్రతినిధులు గడీల శ్రీకాంత్ గౌడ్, సంజయ్ ఘనాతే, లింగాయత్ సంఘం ప్రతినిధులు సంకటాల సోమేశ్వర్, తోట చంద్రశేఖర్ పటేల్, జగన్నాథ్, కోవూరి సంగమేశ్వర్, చంద్రశేఖర్, నేతి మహేశ్, సిద్దేశ్వర్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.