అలప్పుళ: కేరళ లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బిజెపి నాయకుడి హత్య కేసులో అలప్పుళ కోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణశిక్ష విధించింది. దోషులందరూ నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వారు.. ఒక కేసులో ఇంత ఎక్కువ మందికి మరణశిక్ష విధించడం కేరళ చరిత్రలోనే ఇదే తొలిసారి.
నిందితుల్లో 8 మందిపై హత్య అభియోగాలు, మిగతా వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, బిజెపి నేతను ఆయన కుటుంబం కళ్లముందే అతి దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అత్యంత క్రూరమైన నేరంగా దీన్ని పరిగణించి దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
కేసు వివరాలలోకి వెళితే …
2021 డిసెంబరు 19న అలప్పుళ లో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేశారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు అతని ఇంట్లోకి చొరబడి అతడిని కుటుంబ సభ్యుల ఎదుటే అత్యంత పాశవికంగా చంపేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది.
కాగా, అదే ఏడాది ఏడాది డిసెంబరు 18న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల హత్య చేశారు.. దీనికి ప్రతికారంగానే కొద్ది గంటలకే రంజిత్ హత్య చేశారు పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు.