కరీంనగర్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి సమగ్ర శిక్ష అభియాన్ నాయకులు సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానన్నారు.
తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పార్టీ నాయకత్వం అసలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ద్రుష్టి సారించనేలేదన్నారు. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలన్నారు.
భారతీయ జనతా పార్టీలో పోలింగ్ అధ్యక్షుడి నుండి జాతీయ అధ్యక్ష నియామకం వరకు సమిష్టి నిర్ణయాల మేరకే జరుగుతాయని, ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇంకా జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశమే చర్చకు రాలేదని, నాపై అభిమానంతో కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు.
పార్టీ నాయకత్వం నాకు హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలు అప్పగించిందని, సమర్ధవంతంగా నిర్వర్తించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. అంతే తప్ప నేను రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే లేనని, జరుగుతున్న ప్రచారమంతా ఊహగానాలే అన్నారు.
మీడియా ఇలాంటి వార్తలు రాయడంవల్ల కొందరు కావాలనే నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్నారు. దయచేసి మీడియా, సోషల్ మీడియా మిత్రులకు చేతులు జోడించి విజ్ఝప్తి చేస్తున్నాని, ఇలాంటి కథనాలతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందన్నారు. అట్లాగే వ్యక్తిగతంగా నాకు కూడా నష్టం జరిగే అవకాశముందను, దయచేసి ఇకపై అలాంటి కథనాలు రాయొద్దన్నారు.