Tuesday, November 19, 2024

Delhi | దేశాన్ని బీజేపీ విడదీస్తోంది.. కాంగ్రెస్ జోడించాలని చూస్తోంది: వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశాన్ని విడదీస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన, తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ శిథిలమైందని, తుప్పు పట్టి పోయిందని అవమానించే అధికారం మోడీకి ఎక్కడిదని అన్నారు. ఒక దేశ ప్రధాని మాట్లాడే మాటలేనా ఇవి అంటూ మండిపడ్డారు.

దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు బీజేపీ, ఆరెస్సెస్ ఎక్కడున్నాయని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం రాకముందు పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేస్తూ.. ప్రధానికి అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. మహిళా బిల్లు ఆమోదం చేయడం కాదు.. బీసీ వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని, అప్పుడే బీజేపీ అహంకారం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని అన్నారు. బీజేపీ దేశాన్ని విడగొట్టాలని చూస్తోందని, తమ నేత రాహుల్ గాంధీ దేశాన్ని జోడించాలని చూస్తున్నారని తెలిపారు. పశువులు, జంతువులను లెక్కిస్తున్నారని, బీసీలకు జనగణన చేయరా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement