అసోం ఎన్నికలపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం…
తేయాకు కార్మికుల రోజువారీ వేతనం పెంపునకు తోటల సంఘం ఒప్పుకోలు
భాజపాకు అనుకూలంగా మారుతున్న నిర్ణయం
40 నియోజకవర్గాలపై ప్రభావం శ్రీ కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి
కార్మికుల విశ్వాసాన్ని చూరగొనలేకపోయిన రాహుల్, ప్రియాంక పర్యటనలు
అసోం టీకి అంతర్జాతీయ పేరు తీసుకొస్తామని కమలనాథుల హామీ
అధికార పార్టీకి అనుకూలంగా ట్రెండ్ శ్రీ పరిశీలకుల విశ్లేషణలు
గువహటి నుంచి ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – కార్మికులు, కూలీల పట్ల దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వివక్ష అమలౌతోంది. అసోం జనాభాలో 17శాతం మంది తేయాకు తోటల్లో పని చేస్తున్న కార్మికులే. వీరంతా పట్ట ణాలు, నగరాలకు దూరంగా కొండవాలు ప్రాంతాల్లోనే చిన్న చిన్న గ్రామాల్లో జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ఏడాదిలో 8మాసాలు మాత్ర మే వీరికి తోటల్లో పనులుంటాయి. ప్రస్తుతం టీ తోటలు తీవ్రనష్టాల్ని ఎదుర్కొంటున్నాయి. అందుకు తగ్గట్లే కార్మికుల జీవన ప్రమాణాలు న్నాయి. వారికి గరిష్టంగా రోజుకు 167 రూపా యలు మాత్రమే వేతనం లభిస్తోంది. దీన్ని కనీసం 50 రూపాయలు పెంచాలన్న డిమాండ్ దీర్ఘకాలంగా నెలకొంది. తాజాగా టీ తోటల యజ మానుల సంఘం 25 రూపాయలు పెంచేందుకు అంగీకరించింది. ఇది కూడా అసెంబ్లి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార బీజేపీ ఒత్తిడి మేరకే జరిగింది. వేతనాల పెంపు వ్యవ హారం ఇప్పటికీ అసోం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై వ్యాజ్యాలు గత నాలుగేళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళుగా రూపాయి పెంపునకు కూడా అంగీకరించని యజమానులు ఇప్పుడు 25 రూపాయలు పెంచడం వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు దాగున్నట్లు పరిశీలకులు అంచనాలేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలౌ తోంది. దీని కింద ఏటా కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పిస్తారు. రోజువారి గరిష్టంగా 250 రూపాయల వరకు చెల్లిస్తారు. ఈ చెల్లింపు మొత్తం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధం గా ఉంటుంది. కేంద్రమిచ్చే మొత్తానికి రాష్ట్రం మరికొంత జోడిస్తుంది. అయితే అసోం వంటి వెనుకబడ్డ రాష్ట్రంలో ఈ పథకాన్ని తేయాకు కార్మికులకు అందుబాటులో పెట్టడంలేదు. దీన్ని కార్మికులకు వర్తింపజేస్తే తేయాకు తోటల్లో పనులకు వెళ్ళేందుకు వీరు ఇష్టపడరు. ఇది టీ తోటల యజమానులకు నష్టం కలిగిస్తుంది. తోటల్లో కార్మికుల కొరతకు కారణమౌతుందన్న అంచనాలతోనే ప్రభుత్వం ఈ పథకం జోలికెళ్ళడంలేదు. కానీ ఇప్పుడు పెంచిన రూ.25లు తోటల యజమానులకు అదనపు భారం కానున్నాయి. ఇది కేవలం రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి ఉపకరించే ప్రక్రియ తప్ప ఇటు కార్మికులకు, అటు తోటల యజమానులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు.
అసోం అసెంబ్లి ఎన్నికల్లో 40కి పైగా స్థానాల్లో జయాపజయాల్ని నిర్ధారించగలిగే తేయాకు తోటల కార్మికులు తాజా పరిణామాలతో బీజేపీకి అనుకూలంగా మారుతున్న సంకేతాలున్నాయి. పైగా ఈ 40 నియోజక వర్గాల్లోనూ అత్యధిక సంఖ్యలో మొదటి విడత మార్చి 27వ తేదీనే ఎన్నికలకెళ్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోజువారి వేతన పెంపుదలపై టీ ఎస్టేట్ యజమానుల సంఘం ఒక రోజు ముందు తాత్కాలిక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం హైకోర్టులో ఉంది. అయితే తుది తీర్పు వెలువడక ముందే అధికార బీజేపీ అధినేతల ఆదేశాలకు ఈ సంఘం తలొగ్గింది. వేతనాల మధ్యంతర పెంపునకు తమ ఆమోదం ప్రకటించింది. ఇది కనీసం 40నియోజక వర్గాల్లో బీజేపీ గెలుపునకు సానుకూల ప్రక్రియగా మారింది.
ఈ సారి అసోం ఎన్నికల్లో తేయాకు తోటల కార్మికుల పైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆశలెట్టుకుంది. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో జరిపిన ఎన్నికల ప్రచారంలో అధికంగా ఈ 40 నియోజక వర్గాల పరిధిలోనే పర్యటిం చారు. తేయాకు తోటల కార్మికులతో కలసి రాహుల్‌గాంధీ సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. రెండ్రోజుల క్రితం వరకు ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్‌కు సానుకూలంగానే కనిపించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు అనుకూలతలు మారిపోతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున ఒక్కో కార్మికుడికి 167 రూపాయల చొప్పున వేతనం లభిస్తోంది. ఇది ఏ విధంగానూ వారి కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ దృష్టికి కార్మికులు తెచ్చారు. అయితే ఆయన నుంచి దీనిపై ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. వాస్తవానికి ఈ కార్మికులు దీర్ఘకాలంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లేస్తున్నారు.
అయినప్పటికీ ఆ పార్టీ ద్వారా తమ జీవన ప్రమాణాలు మెరుగవలే దని భావిస్తున్నారు. వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ మేం కాంగ్రెస్‌కు ఓటేశాం.. కానీ మాకు కాంగ్రెస్ పాలనలో సొంతిల్లు ఇవ్వలేదు. కనీసం టాయిలెట్ కూడా కట్టించలేదు. మా ప్రాంతానికి రోడ్లేయలేదు. మేం టీ తోటల్లో పనికెళ్ళేందు కు మురుగుతో నిండిన మట్టిరోడ్లపైనే నడిచి వెళ్ళాల్సి వచ్చేదంటూ అసోంలోని డిబ్రూఘర్ ప్రాంతానికి చెందిన చాభువా గ్రామ నివాసి, తేయాకు కార్మికురాలు బసంతకుమా రి ఈ ప్రాంతంలో పర్యటించిన మీడియాకు వెల్లడించారు. 38ఏళ్ళ బసంతకుమారి తన సాటి కార్మికులు మనుగడ కోసం తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి అసోంలో ఉందని పేర్కొన్నారు. అసోంలో దీర్ఘకాలం కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2016లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అసోం ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిల్చారు. అసోంలోని ప్రధాన సమస్యల్లో తేయాకు కార్మికుల జీవన ప్రమాణాలొకటి.
బ్రిటీష్ పాలకులు 1836లో ఇక్కడ తేయాకు తోటలు నాటారు. 19వ శతాబ్దంలో వివిధ ప్రాంతాల నుంచి అసోంకు ఒప్పంద కార్మికుల్ని తీసుకొచ్చారు. వీరంతా తోటల్లో పని చేస్తూ సమీప గ్రామాల్లో స్థిరపడ్డారు. స్వతంత్రమొచ్చినప్పటి నుంచి వీరు కాంగ్రెస్‌నే నమ్మారు. అయితే వేతనాలు పెంచుతామన్న హామీని కాంగ్రెస్ ఏనాడూ ఆచరణలోకి తేలేకపోయింది. ఈ దశలో గత ఎన్నికల్లో ఈ కార్మికులు బీజేపీకి అండగా నిల్చారు. అప్పటి ఎన్నికల్లో కనీస వేతనాన్ని రూ.351కి పెంచుతామని బీజేపీ హామీనిచ్చింది. అయితే అధికారంలోకొచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాలకు టీ ఎస్టేట్ యజమానుల సంఘం గండికొట్టింది. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం చాహ్ భాగిఛా ధన్ పురస్కార్ మేళా పేరిట ఓ పథకాన్ని తెచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలౌతోంది. ఈ పథకం క్రింద ప్రతి తేయాకు కార్మికుడికి ఏటా రూ.8 వేలు ఖాతాలో జమయ్యాయి. అలాగే లాక్‌డౌన్ సమయంలో ప్రతి కార్మికుడికి ప్రభుత్వం రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది. తేయాకు కార్మికుల కోసం బీజేపీ ప్రభుత్వం ఇళ్ళిచ్చింది. అలాగే వారు నివాసముంటున్న ప్రాంతాల్లో రోడ్లేసింది.
తేయాకు కార్మికులున్న చాభువా ప్రాంతం సీఏఏ వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువైంది. వాస్తవానికి ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో బీజేపీకి చెందిన బినోద్ హజారి కా గెలుపొందారు. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల ను ఆయన ఆపలేకపోయారు. దీంతో తేయాకు కార్మికులు ఈ సారి తమకు అండగా నిలవరన్న భయం బీజేపీని ఆవరించిం ది. అందుకు తగ్గ ముందస్తు జాగ్రత్తల్ని ఆ పార్టీ తీసుకుంది. నిరసనలు అధికంగా జరిగిన నియోజక వర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టడం మానేసింది. ఆ స్థానాల్ని పొత్తు లో భాగంగా అసోం ఘన పరిషత్‌కు ఇచ్చేసింది. ఇప్పుడు తేయాకు కార్మికులు అధికంగా ఉన్న నియోజక వర్గాల ఈవిఎంలలో కలవపువ్వు చిహ్నం కనిపించదు. అందుకు బదులుగా ఏజీపీకి చెందిన ఏనుగు గుర్తు ఉంటుంది. బ్రహ్మపుత్ర లోయ, బరాక్ వ్యాలీలలో ఎక్కువగా నష్టపోకుం డా బీజేపీ ఈ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అయితే తాజా గా రోజువారి కార్మికుల వేతనంలో రూ.25లు మధ్యంతర వృద్ధిని ఇండియన్ టీ అసోసియేషన్ అమల్లోకి తెచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా భారతీయ టీ ఉత్పత్తుల ప్రాధాన్యతను కాంగ్రెస్ మసకబారుస్తోందంటూ బీజేపీ ప్రచారం మొదలెట్టింది. భారతీయ టీకి ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాధాన్యత పెంచే బాధ్యతను తీసుకుంటానని సాక్షాత్తు ప్రధాని మోడి హామీనిచ్చారు. ఆయన రాష్ట్రంలో తేయాకు తోటలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. టిన్సుటియా జిల్లాలోని జన్‌ముఖ్ ఖేల్‌ఖాదర్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
అసోం ప్రజలకు తేయాకు తోటలకు అవినాభావ సంబంధముంది. అసోం ప్రజల ఆర్థిక వ్యవస్థలో తేయాకు తోటలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక్కడ తేయాకు ఉత్పత్తులు మందగించినా లేక ఎగుమతులు తగ్గినా అది అసోం ప్రజల రోజువారి జీవన ప్రమాణాల్ని దెబ్బతీస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు తేయాకు కార్మికులపైనే ఆశలెట్టుకున్నాయి. ఈ నెల 27న అసోంలో జరిగే మొదటి విడత 47నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఎక్కువ అసోం ఎగువ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటిలో తేయాకు కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ దశలో తేయాకు తోటల యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయం అధికార పార్టీకి కలిసొస్తుందని పరిశీలకులు అంచనాలేస్తున్నారు.