Friday, November 22, 2024

Delhi | ఇవ్వాలే బీజేపీ ఫ‌స్ట్ లిస్ట్?.. 125 మందికి పైగా పేర్లతో జాబితా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొందించింది. ఈ జాబితా శుక్రవారం (నేడు) విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులున్నారు.

కేంద్ర పాలిత రాష్ట్రాల నేత‌లు కూడా..

జాబితాలోని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పిలుపు అందుకున్నవారిలో దేవంద్ర ఫడ్నవీస్, ప్రకాష్ జవడేకర్, మన్సుఖ్ భాయ్ మాండవియా, పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్, భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, కేశవ్ ప్రసాద్ మౌర్య, యోగి ఆదిత్యనాథ్, బ్రజేష్ పాఠక్, భజన్‌లాల్ శర్మ, సీపీ జోషి, భూపేంద్ర పటేల్, విష్ణుదేవ్ సాయి తదితరులున్నారు. మొత్తంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తొలి సమావేశంలో దేశవ్యాప్తంగా 125 సీట్లకు పైగా అభ్యర్థుల పేర్లను ఆమోదించినట్టు తెలిసింది.

మార్చి 10 లోగా మొత్తం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేలా..

- Advertisement -

మార్చి 10లోగా దాదాపు 300 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించకముందే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే.. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉండవచ్చని భావిస్తోంది. గత ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఇంతవరకు గెలుచుకోలేకపోయిన స్థానాలు, అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన స్థానాలకు అభ్యర్థులను చాలా ముందుగా ప్రకటించింది. ఆ స్థానాల్లో ఎక్కువ స్థానాలను బీజేపీ ఈసారి గెలుచుకోగలిగింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ తరహాలో ముందే సగానికి పైగా అభ్యర్థులను ఖరారు చేస్తే జాతీయ నాయకత్వం సైతం తదుపరి సమయాన్ని పూర్తిగా ప్రచారానికే కేటాయించవచ్చని వారి వ్యూహంగా కనిపిస్తోంది.

సిట్టింగ్ ఎంపీల్లో మూడో వంతు కోత

దేశవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన స్థానాల్లో మూడో వంతు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. మూడు పర్యాయాలకు పైగా గెలుపొంది వయస్సు పైబడినవారికి ఈ సారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. యువ నాయకత్వానికి, తదుపరి తరానికి అవకాశం ఇవ్వడం కోసమే పార్టీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గెలుపొందిన అనంతరం ముఖ్యమంత్రులను ఎంపిక చేసే విషయంలోనూ కమలదళం అధిపతులు ఇదే తరహాలో వ్యవహరించారు.

ప‌లు చోట్ల కొత్త‌వారికి ఇంపార్టెన్స్‌

మూడు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన సీనియర్లను కాదని కొత్తవారికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీల్లో 25-30 శాతం మేర కోత విధించి వయస్సు పైబడని సిట్టింగ్‌లను కొనసాగించే అవకాశం ఉంది. మొత్తంగా సుమారు 90 సీట్లలో సిట్టింగ్‌లకు కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో ఉన్నదే నలుగురు ఎంపీలు కావడం, అందరూ మొదటిసారి ఎంపీలుగా గెలుపొందినవారే కావడంతో వారిలో ముగ్గురికి కొనసాగింపు దక్కింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఈ మధ్యకాలంలో వివాదాల్లోకి చిక్కుకుని విమర్శలు ఎదుర్కోవడంతో ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను అధిష్టానం పరిశీలించింది. అయితే ఆదివాసీ, బంజారా సమీకరణాలను బేరీజు వేసుకుని ఈ స్థానంలో సోయం బాపూరావుకు మళ్లీ టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది అధిష్టానం తేల్చనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement