Tuesday, November 26, 2024

మణిపూర్‌లో బీజేపీ ఒంటరి పోరు..

ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన మణిపూర్‌ అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27, మార్చి 3న అసెంబ్లి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపు మణిపూర్‌ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొన్నటి వరకు మేఘాలయ సీఎం కాన్రోడ్‌ సంగ్మా నేతృతంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)తో కలిసే మేఘాలయలో బీజేపీ పోటీ చేయనుందని అందరూ భావించారు. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరలేదు. 60 అసెంబ్లి స్థానాలు ఉన్న మణిపూర్‌లో 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఎన్‌పీపీ అధినేత సంగ్మా ప్రకటించారు. అయితే సగం స్థానాలు కావాలని బీజేపీ పట్టుబట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాన్రోడ్‌ సంగ్మా.. ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగడానికి బీజేపీ నిర్ణయించుకుంది. ఎన్‌పీపీతో పొత్తు వికటించడంతో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్టు బీజేపీ ఆదివారం ప్రకటించింది. కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాబోయే మణిపూర్‌ అసెంబ్లి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 60 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నాం. రాష్ట్రంలో మూడింట రెండు వంతు మెజార్టీ ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ఆదివారం బీజేపీ 60 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌.. హేంగ్యాంగ్‌ అసెంబ్లి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికలకు ముందు మిత్రపక్షం మారకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా గతంలో రాబోయే మణిపూర్‌ అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేయబోయే అనేక పార్టీ సభ్యులతో బీజేపీ సహకార ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలిపింది. బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సీహెచ్‌ బిజోయ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న రాజకీయ దృష్టాంతంలో పార్టీలు మారకుండా ఉండటానికి ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ సమక్షంలో చాలా మంది అభ్యర్థులతో పార్టీ సహకార ఒప్పందంపై సంతకం చేసిందన్నారు. ఎన్నికల్లో పోటీకి దింపేందుకు, సభ్యుల మధ్య సత్సంబంధాలు, సహకారాన్ని నిర్ధారించడానికి కాషాయ పార్టీ సున్నితత్వ సమావేశాలను నిర్వహించిందన్నారు. 2017లో మణిపూర్‌లో 28 సీట్లు సాధించిన కాంగ్రెస్‌తో పోలిస్తే.. బీజేపీ 21 సీట్లు సాధించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు స్థానిక సంస్థలు ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌లతో చేతులు కలపడం ద్వారా అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో బీజేపీ బలం 30కు చేరుకుంది.

ఆశవాహుల నిరసనలు..

అసెంబ్లి ఎన్నికలకు సంబంధించి 60 మంది పేర్లను ప్రకటించడంతో ఆశవాహులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం బీరెన్‌ సింగ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్‌ ఆశించిన వారికి నిరాశ ఎదురవడంతో.. వారంతా.. పార్టీని వీడేందుకు నిర్ణయించినట్టు సమాచారం. మణిపూర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున నిరసనకారులు పోగై.. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఇంఫాల్‌లోని పార్టీ కార్యాలయల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు నేతలు బీజేపీకి రాజీనామాలు చేశారు. టికెట్‌ ఆశించి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు సమాచారం. సుమారు 10 మంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి చేరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement