Monday, November 25, 2024

TG | ఈ నెల 29న బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం

మహారాష్ట్రలో గెలుపు స్ఫూర్తిగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన కార్యచరణను ఖరారు చేయడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 29న బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం కానుంది.

ఇటీవల మహారాష్ట్రలో ఎన్‌డీఏ కూటమి అఖండ విజయం, లగచర్లలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతుల నిరసన, రైతులపై అక్రమ కేసుల బనాయింపు, త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, కులగణన విషయంలో ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

అదే సమయంలో రాష్ట్రంలో సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వాల సంఖ్య తదితర అంశాలను కూడా చర్చించనున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా తెలంగాణలో డిసెంబరు 1 నుంచి బూత్‌ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయ వరకు ఏర్పాటు చేయనున్న పార్టీ నూతన కార్యవర్గాలపై కూడా కోర్‌ కమిటీ చర్చించనుంది.

ఈ సమావేశం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుందని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌తోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement