కేసీఆర్‌పై ఆరోపణలతో బీజేపీ కాలం నెట్టుకొస్తున్నదని, ముఖ్యమంత్రిని అభాసుపాలు చేయడం కోసం కుట్రలు పన్నుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏం సంబంధమని, ఆయన ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ప్రధాని ప్రసంగమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తిట్టడానికే పరిమితమైందన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేను మూడేండ్ల కిందటే ఆరు లేన్లు చేయాల్సి ఉందని, ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఎహెచ్65 నుంచి 565 హైవే లింక్ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని చెప్పారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలోనే నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ కేటాయించారని, అయినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీటన్నింటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాట్లాడరని విమర్శించారు.
ప్రతిపక్షాలు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేయడం దుర్మార్గమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్లమెంటులో మాట్లాడుకొని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఆరోపణుల చేసి హైదరాబాద్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు. రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ విఫలమైందని చెప్పారు. ఆ పార్టీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసుల మాఫీ కోసమే ప్రతిపక్షాల నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలు, రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ పెత్తనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పక్కకు పెట్టడం సరికాదన్నారు. గవర్నర్లు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కావొద్దన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.