న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) – జనసేన పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలిసింది. అయితే జనసేన మరిన్ని సీట్లకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో రెండు సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధపడినట్టు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా.. కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
మరోవైపు బీజేపీ తదుపరి అభ్యర్థుల జాబితాపై అధిష్టానంతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ చేరుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మంగళవారం రాత్రి పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ ఎలక్షన్స్ ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలిసింది.
అదే సమయంలో రాజస్థాన్ మలి జాబితాపై కసరత్తు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నడ్డా నివాసానికి చేరుకున్నారు. రాజస్థాన్‌లో మరో 76 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 119 స్థానాల్లో రెండు విడతలుగా 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇవ్వనున్న స్థానాలను మినహాయించి, అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ కోర్ కమిటీ నేతలు నడ్డా నివాసంలో సమావేశమయ్యారు.
బుధవారం సాయంత్రం గం. 6.00కు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఈ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కమిటీ సభ్యులుగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, డా. కే. లక్ష్మణ్ తదితరులు హాజరుకానున్నారు.
బుధవారం నాటి సమావేశంలో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 25న రాజస్థాన్, నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ప్రచారంపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం జరిగే సమావేశంతో దాదాపు ఈ కసరత్తును పూర్తిచేసే అవకాశం ఉంది.