Monday, November 25, 2024

Delhi | రేపే బీజేపీ సీఈసీ భేటీ.. తెలంగాణ, మిజోరాం అభ్యర్థులపై కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసి రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయితే బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.మంగళవారం సాయంత్రం గం. 6.30కు న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది.

ఈ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, శర్బానంద సోనోవాల్, భూపేందర్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు యడియూరప్ప, డా. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, డా. సుధా యాదవ్, డా. సత్యనారాయణ్ జతియా, దేవేంద్ర ఫడ్‌ణవీస్, ఓం ప్రకాశ్ మాథుర్, వనతి శ్రీనివాసన్, డా. కే. లక్ష్మణ్ పాల్గొననున్నారు.

- Advertisement -

మంగళవారం నాటి భేటీలో తెలంగాణతో పాటు మిజోరాం అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రోజు విరామం తర్వాత అక్టోబర్ 19న మరోసారి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమవుతుందని, ఆ భేటీలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి.

బరిలో బడా నేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో పార్టీకి చెందిన పెద్ద నేతలందరినీ బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ విడుదల చేసిన 2వ జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలను బరిలోకి దించిన విషయం తెలిసిందే. పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చంబల్ ప్రాంతంలో ఈ ఏడుగురు నేతలను బరిలోకి దించడం ద్వారా ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుపొందాలని భావిస్తోంది. అదే వ్యూహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అమలు చేయనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.

ఈ లెక్కన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ, డా. కే. లక్ష్మణ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంపీ బండి సంజయ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరులా కనిపిస్తున్న వాతావరణాన్ని మార్చి ముక్కోణపు పోటీని నెలకొల్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో బడా నేతలను బరిలోకి దించడం ఉపకరిస్తుందని ఆ పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఏ పార్టీకి అధికారం దక్కని హంగ్ ఫలితాలు ఏర్పడితే బీజేపీ కింగ్ మేకర్ అవతారం ఎత్తవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement