విజయవాడ: ఎపిలో పాలన అనేది లేదని, అంతా దోపిడీయేనంటూ ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చేనిధులతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అలాగే రైతు భరోసా పథకంలో సైతం కేంద్ర నిధులతోనే నడుస్తుందని వివరించారు.
రాష్ట్రంలో రహదారులను చూస్తే చాలని ఎపి పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. తొలి ప్రెస్ మీట్ లోనే జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ” కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నాం. రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయి. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైంది? పదో తరగతి బాలుడిపై పెట్రోల్ పోసి చంపేశారు. అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు 2 రోజులున్నారు. ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 65 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలి. కానీ, 35 శాతం కూడా పూర్తి కాలేదనేది వాస్తవం. ఈ విషయంలో పేదలకు వైకాపా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రాష్ట్రంలో రహదారుల దుస్థితేంటో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పరిశ్రమలూ తరలిపోతున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. భాజపాపై రాష్ట్రంలో దుష్ప్రచారం జరుగుతోంది. ఓట్లతో నిమిత్తం లేకుండా ఏపీకి భాజపా సహకరిస్తోంది.” అని పురందేశ్వరి అన్నారు
విజయవాడలో బాధ్యతలు స్వీకరణ కంటే ముందు . హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పురందేశ్వరి సందర్శించారు. తండ్రి ఎన్టీఆర్ సమాధి వద్ద తన నియామక పత్రాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గన్నవరం చేరుకున్న ఆమెకు.. కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆపై భారీ వాహన ప్రదర్శనతో విజయవాడకు వచ్చి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పురందేశ్వరి వెంట ఏపీ భాజపా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నేతలు సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.