Tuesday, November 26, 2024

Delhi | బ్రిక్స్ పొలిటికల్ లీడర్స్ సమ్మిట్‌లో బీజేపీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ నగరంలో జులై 18 నుంచి జరగనున్న ‘బ్రిక్స్ పొలిటికల్ లీడర్స్ ప్లస్ డైలాగ్’ సదస్సులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాల్గొననుంది. ఈ మేరకు నలుగురు సభ్యులతో ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి కే. అన్నామళై నేతృత్వం వహించనున్నారు.

కర్నూలుకు చెందిన బీజేపీ యువ నేత డా. వినూష రెడ్డిని పార్టీ అధిష్టానం ఈ బృందంలో సభ్యురాలిగా ఎంపిక చేసింది. మిగతా సభ్యులుగా సత్యేన్ గులాబ్కర్, పుష్కర్ మిశ్రాలను పార్టీ ఎంపిక చేసింది. గురువారం ఈ నలుగురు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అంతర్జాతీయ వేదికపై పార్టీ తరఫున వివిధ అంశాలపై ఈ నలుగురు ప్రసంగించనున్నారు. అందులో వైద్యం, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరుల అభివృద్ధి అంశాలపై డా. వినూష రెడ్డి ప్రసంగించనున్నారు.

- Advertisement -

సమావేశానికి వెళ్లే ముందు జాతీయాధ్యక్షుడిని కలిసి ప్రసంగించే అంశాలపై ఆయనతో చర్చించారు. దేశ విదేశాంగ విధానానికి అనుగుణంగా పార్టీ వైఖరిని వెల్లడించేలా ఈ ప్రసంగాలు ఉండాలని జేపీ నడ్డా సూచించినట్టు తెలిసింది. సుమారు గంట సేపు నడ్డా ఈ నలుగురితో మాట్లాడి దిశానిర్దేశం చేశారు.

‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’ ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సులో బ్రిక్స్ దేశాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. బ్రిక్స్ దేశాల పరస్పర సహకారానికి ఉపయోగపడే వివిధ అంశాలపై సదస్సులో సమావేశాలను ఏర్పాటు చేసింది.

నమ్మలేకపోతున్నా: డా. వినూష రెడ్డి

భారతీయ జనతా పార్టీ తరపున అంతర్జాతీయ వేదికపై ఏకంగా మూడు అంశాలపై ప్రసంగించే అవకాశం తనకు దక్కడంపై డా. వినూష రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం దక్కడంపై స్పందన కోరగా.. తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కర్నూలుకు చెందిన డా. వినూష వృత్తిరీత్యా వైద్యురాలైనప్పటికీ రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్)తో అనుబంధం కలిగిన ఆమె పార్టీ తరఫున వివిధ పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు. బ్రిక్స్ సదస్సుకు పార్టీ తనను ఎంపిక చేస్తుందని తాను అస్సలు ఊహించలేదని, తాను ఎలాంటి ప్రయత్నం కూడా చేయనేలేదని ఆమె తెలిపారు.

తన నేపథ్యం గురించి పార్టీ దగ్గర ఇంత సమాచారం ఉందన్న విషయం కూడా తెలియదని, దేశవ్యాప్తంగా కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేయగా అందులో తనకు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తొలిసారిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయానికి వచ్చానని, పార్టీ జాతీయాధ్యక్షుడిని కలవడం మొదటిసారి అని ఆమె చెప్పారు. పార్టీలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని చెప్పడానికి తన ఉదంతమే ఒక ఉదాహరణ అని ఆమె వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement