న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ లోని కిరత్ పూర్ సాహిబ్ కు కారులో వెడుతుండగా ఆమెను రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్న తమను ఖలీస్తానీలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఆమె కారును నిలిపివేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ చట్టాలను సమర్ధించిన బాలీవుడ్ నటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఏడాదిపాటు రైతులు ఉద్యమించిన నేపథ్యంలో ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
కాగా శుక్రవారం కంగనారనౌత్ పంజాబ్ లోని కిరత్ పూర్ సాహిబ్ కు కారులో బయలుదేరారు. కాగా ఆమె కారును అడ్డగించిన ఆందోళనకారులు వ్యతిరేక నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రనౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను అల్లరిమూక అడ్డుకుని చంపేస్తామంటూ నినాదాలు చేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. తానేమీ రాజకీయ పార్టీ నాయకురాలిని కానని, ఒక పౌరురాలిగా అభిప్రాయం చెప్పానని, ఇలా బెదరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మేరకు ఓ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.